టేకులపల్లి : గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం కాని, అధికారులుగాని స్పందించకుండా నిర్లక్షవైఖరిని అవలంభిస్తున్నారని సిపిఐ ఎమ్‌ఎల్ న్యూడెమోక్రసీ ఇల్లెందు సబ్‌డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరంను సందిర్శించి వారికి సంఘీభావం తెలిపిన అనంతరం నాయకులు బానోత్ ఊక్లా, నోముల భానుచందర్‌లు మాట్లాడారు.
పంచాయతీ కార్మికుల సమ్మె ఆరు రోజులుగా నిరవధికంగా కొనసాగుతుందని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అయినప్పటికీ కార్మికులు మడమ తిప్పకుండా తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష వైఖరిని వదిలి తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.