ప్రోస్టేట్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణకు నిర్వహించే పీఎస్‌ఏ పరీక్షలో కొత్త ప్రమాణాలు
అపోలో అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణకు నిర్వహించే పిఎస్‌ఏ (ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష) ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు భారతదేశ పిఎస్‌ఏ ప్రమాణాలకు భిన్నంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ తాజా అధ్యయనంలో తేలిందని యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ అడ్డాల వెల్లడించారు. చెన్నై, హైదరాబాద్ అపోలో ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న వివిధ వయసులకు చెందిన సుమారు లక్ష మందికి పైగా ఆరోగ్యవంతమైన పురుషులపై జరిపిన అధ్యయనంలో పిఎస్‌ఏ ప్రమాణాలకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. శుక్రవారం అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డితో కలిసి డాక్టర్ సంజయ్ అడ్డాల పిఎస్‌ఏ ప్రమాణాలకు సంబంధించి అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన అధ్యయన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఎస్‌ఏ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ముందస్తు రోగ నిర్ధారణ రక్త పరీక్ష అని పేర్కొన్నారు. 1993 నుండి యుఎస్‌ఎ అధ్యయనం ద్వారా రూపొందిచబడిన పిఎస్‌ఏ ప్రమాణాలనే భారతదేశంలో అవలంబించబడుతున్నాయని చెప్పారు. పాశ్చాత్య దేశాల పిఎస్‌ఏ ప్రమాణాలు మన దేశ పిఎస్‌ఏ ప్రమాణాలకు భిన్నంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో భారతదేశంలో పిఎస్‌ఏ విలువలు విభిన్నంగా ఉన్నాయని వెల్లడైందని తెలిపారు. 40 ఏళ్ల లోపు పురుషుల్లో పిఎస్‌ఏ ప్రమాణాలు 1.4 కంటే తక్కువగా ఉంటే అతను ఆరోగ్యవంతంగా ఉన్నట్లుగా తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. అలాగే గతంలో 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిలో పిఎస్‌ఎ ప్రమాణాలు 2.5 కంటే తక్కువగా సాధారణంగా భావించేవారని, కానీ తమ అధ్యయనంలో 1.7 కన్నా తక్కువగా ఉన్నా సాధారణంగా ఉన్నట్లే అనే విషయం వెల్లడైందని వివరించారు. వివిధ వయస్సుల ఆధారంగా పిఎస్‌ఏ ప్రమాణాలు మారుతాయని తెలిపారు.
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానుగుణంగా మన దేశంలోని బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ చాప క్రింది నీరుల విస్తరిస్తోందని అన్నారు. ఈ క్యాన్సర్లకు ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్ నిర్వహించిన ఈ తాజా అధ్యయనం భారతదేశంలోని ప్రోస్టేట్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణలో కీలక మార్పులను తీసుకువస్తుందని వ్యాఖ్యానించారు. ఈ తాజా అధ్యయనం ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు ఆ మహమ్మారిని జయించడంలో ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఈ మార్పు యువకులలో ముందుగా ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని అన్నారు. ఈ నిర్దేశిత పిఎస్‌ఎ కొత్త ప్రమాణాలను అవలంబించడం ద్వారా అపోలో హాస్పిటల్స్ రోగి-కేంద్రీకృత సంరక్షణకు తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని వివరించారు.