Friday, December 20, 2024

పోలీస్ ఆఫీసర్‌ను పెళ్లాడనున్న మంత్రి…

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్ అదే రాష్ట్రంలోని సీనియర్ ఐపిఎస్ అధికారిణి అయిన జ్యోతి యాదవ్‌ను ఈ నెల తరువాత పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్ధం జరిగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాన్ ద్వాన్ వీరికి శుభాకాంక్షలు తెలిపారు. రూప్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజక వర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైన హర్జోత్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన 32 ఏళ్ల బేన్స్ ఆనంద్ సాహిబ్ నియోజక వర్గంలోని గంబీర్ పూర్ గ్రామానికి చెందిన వారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందారు. అంతకు ముందు ఆప్ యువజన విభాగాన్ని రాష్ట్రంలో నిర్వహించారు.

చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి 2014లో బిఎ ఎల్‌ఎల్‌బి (ఆనర్స్) పూర్తి చేశారు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం సర్టిఫికెట్ పొందారు. ఆయన వివాహం చేసుకోనున్న వధువు జ్యోతి యాదవ్ పంజాబ్ క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్. ప్రస్తుతం మన్నా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. జ్యోతి యాదవ్ హర్యానా లోని గురుగ్రామ్‌కు చెందిన వారు. గత ఏడాది ఆప్ ఎమ్‌ఎల్‌ఎ రాజీంద్‌పాల్ కౌర్ చినా నియోజక వర్గం లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి వార్తల్లో నిలిచారు. తన అనుమతి లేకుండా సోదాలు చేస్తున్నారని ఆ ఎమ్‌ఎల్‌ఎ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో జ్యోతియాదవ్ లూథియానాలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేసే వారు.

APP Minister marriage with Senior Police Officer

పోలీస్ కమిషనర్ ఆదేశాల పైనే సంఘవ్యతిరేక సంఘటనలపై సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు ఆ ఎమ్‌ఎల్‌ఎకు సమాధానమిచ్చారు. పంజాబ్‌లో గత ఏడాది అదికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో చాలా మంది నేతలు యువకులే. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాతనే సిఎం భగవంత్ మాన్ తన స్నేహితురాలు గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆప్ ఎమ్‌ఎల్‌ఎలు నరీందర్ కౌర్ భరాజ్, నరీంద్ పాల్‌సింగ్ సవానా కూడా ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News