అమెరికా టెక్ కంపెనీ యాపిల్ తక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. నివేదికల ప్రకారం, కంపెనీ ‘ఐఫోన్ ఎస్‌ఇ4’ను విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ సిఇఒ టిమ్ కుక్ ఎక్స్ పోస్ట్‌లో లాంచ్ ఈవెంట్ గురించి సమాచారాన్ని అందించారు. ఆయన వెండి రంగు యాపిల్ లోగో కనిపించే వీడియోను కూడా పంచుకున్నాడు. ‘కొత్త కుటుంబ సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉండండి’ అని కుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇక్కడ ఏ ఉత్పత్తి పేరు వెల్లడించలేదు, కానీ ఇదే ఐఫోన్ ఎస్‌ఇ4 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఇది చౌకైన ఫోన్ కావచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఐఫోన్ ఎస్‌ఇ4 ధర దాదాపు 499 డాలర్లు (సుమారు రూ. 43,000) ఉండే అవకాశముంది. ఈ ఫోన్ లాంచింగ్ కార్యక్రమంలో కంపెనీ కొత్త పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్, ఎం4 మ్యాక్‌బుక్ ఎయిర్, ఎం3 ఐప్యాడ్ ఎయిర్, 11వ తరం ఐప్యాడ్‌లను కూడా విడుదల చేయవచ్చు.