ఎయిర్‌పాడ్స్, వాచ్‌లు, ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన యాపిల్
న్యూయార్క్ : ఎట్టకేలకు అమెరికా టెక్ కంపెనీ యాపిల్ అతిపెద్ద వార్షిక లాంచ్ కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లోని ‘స్టీవ్ జాబ్స్ థియేటర్’లో జరిగిన ఈ కార్యక్రమానికి కంపెనీ ’వండర్‌లస్ట్’ అని పేరు పెట్టింది. భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం మంగళవారం రాత్రి 10:30 గంటలకు జరగ్గా, ఈ వేడుకలో ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. యాపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఒఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ అవుట్ తేదీని కూడా కంపెనీ ప్రకటించారు.
ఐఒఎస్ 17 ఫీచర్లను కంపెనీ మూడు నెలల క్రితం డబ్లుడబ్లుడిసి23 ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ప్రత్యక్ష వాయిస్ మెయిల్ ట్రాన్స్‌క్రిప్షన్, ఫేస్‌టైమ్ సందేశాలను రికార్డ్ చేయగల సామర్థ్యం, వ్యక్తిగతీకరించిన కాంటాక్ట్ పోస్టర్ వంటి ఫీచర్లు ఐఒఎస్17లో అందుబాటులో ఉంటాయి. ఐఒఎస్ 17 అప్‌డేట్ పొందిన తర్వాత ఎవరైనా కాల్‌ని స్వీకరించకపోతే వినియోగదారులు రికార్డ్ చేసిన ఫేస్‌టైమ్ సందేశాలను పంపగలరు. వినియోగదారులు ఇప్పుడు ఆఫ్‌లైన్ మ్యాప్‌లను కూడా ఉపయోగించగలరు. ప్రస్తుతం ఐఒఎస్17 బీటా టెస్టింగ్ దశలో ఉంది.
భారతదేశంలో ఐఫోన్ 15 తయారీ
తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలోని తమిళనాడు ప్లాంట్‌లో ఐఫోన్ 15ను తయారు చేస్తోంది. ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఫాక్స్‌కాన్ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి మార్గాలను కూడా పెంచింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్‌తో పాటు అనేక ఇతర ఉత్పత్తులను విడుదల చేస్తుంది. యాపిల్ 2017లో ఐఫోన్ ఎస్‌ఇతో భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించింది. ఇది మూడు భాగస్వాములు అయిన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్‌లను కల్గివుంది. ఐఫోన్ ఎస్‌ఇ తర్వాత, ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా భారతదేశంలోనే తయారు చేశారు. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఉంది.