చెన్నైలో ఫాక్స్‌కాన్ కేంద్రంలో ప్రారంభించిన యాపిల్
ముంబై : టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలో యాపిల్ తయారీ భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన కేంద్రంలో ఈ ప్రొడక్షన్ చేపట్టారు. ఐఫోన్ 13 తయారీని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తోందని, ఈ ఫోన్ ద్వారా అందమైన డిజైన్, అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్స్, ఎ15 బయోనిక్ చిప్ అద్భుతమైన పనితీరును భారతీయ వినియోగదారులు పొందనున్నారని కంపెనీ తెలిపింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ తయారు చేస్తున్నారు. కంపెనీ ఇప్పుడు దాని రెండు కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల ద్వారా స్థానికంగా అన్ని టాప్ సెల్లింగ్ మోడల్‌లను తయారు చేస్తోంది. ఇక సంస్థ మూడో భాగస్వామి పెగాట్రాన్ ఐఫోన్ 12తో ఈ నెలలో ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది.
యాపిల్ కోసం ఫాక్స్‌కాన్ ఐఫోన్‌ను ఉత్పత్తి చేస్తోంది. చెన్నై ప్లాంట్‌లో ఐఫోన్ 13 ఉత్పత్తి జనవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఫుడ్ పాయిజనింగ్‌పై మహిళా కార్మికుల నిరసనల నేపథ్యంలో యాపిల్ డిసెంబర్‌లో ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత తయారీ వాయిదా వేశారు. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్టర్, ఇది యాపిల్ ప్రధాన సరఫరాదారుగా ఉంది. యాపిల్ ఫోన్లు 2017 నుంచి భారత్‌లో తయారవుతున్నాయి. కానీ సంస్థకు చెందిన ప్రో మోడల్స్ ఏవీ ఇంకా భారతదేశంలో ఉత్పత్తి చేయలేదు. తాజాగా ఐఫోన్ మోడల్ స్థానిక ఉత్పత్తి మధ్య కాల వ్యవధిని 8 నెలల క్రితం నుండి 6 నుండి ఏడు నెలలకు తగ్గించింది. యాపిల్ భారత్‌లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించింది.