హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి.. 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.తెలంగాణ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఈ నెల 15వ తదీన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించగా, తాజాగా ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
షెడ్యూల్ విడుదల పట్ల పిఆర్‌టియుటిఎస్ హర్షం
ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడం పట్ల పిఆర్‌టియుటిఎస్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2.73 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎంఎల్‌సి కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.