హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్‌లాసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టిఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోని, తమకు దగ్గరలోని సెంటర్లను ఎంచుకోవాలని సూచించారు.
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900,ఎస్‌సి,ఎస్‌టి, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది, మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న టిఎస్‌లాసెట్, టిఎస్‌పిటిఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. గురువారం వరకు లాసెట్‌కు 35,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు.
25 వరకు ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పెంపు
రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు గురువారంతో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ. రామకృష్ణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తమకు దగ్గరలోఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్, బిసి విద్యార్థులు రూ.700,ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 30వ తేదీన దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 18న ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్‌కు గురువారం వరకు 21,456 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.