Monday, December 23, 2024

గోఫస్ట్ ‘దివాలా’ దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నగదు కొరతతో సతమతమవుతున్న బడ్జెట్ విమానయాన సంస్థ గోఫస్ట్ ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) వద్ద స్వచ్ఛంద దివాలా పిటిషన్ కోసం దరఖాస్తు చేసింది. గోఫస్ట్ మూడు రోజులు అంటే మే 3, 4, 5 తేదీల్లో బుకింగ్‌లను నిలిపివేసింది. ఇంజన్లు సరఫరా కాకపోవడంతో 28 విమానాలను నిలిపివేసినట్లు ఎయిర్‌లైన్ చీఫ్ కౌశిక్ ఖోనా తెలిపారు. చమురు కంపెనీలకు బకాయిలు చెల్లించలేకపోవడంతో విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది దురదృష్టకర నిర్ణయమని, అయితే కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడం అవసరమని ఆయన అన్నారు. విమానాలను రద్దు చేయడంపై విమాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గోఫస్ట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

దీనిపై కంపెనీ స్పందిస్తూ డిజిసిఎకు నివేదికను కూడా సమర్పిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం గోఫస్ట్ తన విమానాలను నగదు, క్యారీ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఇంజిన్ల సరఫరా సమస్యల కారణంగా ఎయిర్‌లైన్ ఈ స్థితికి చేరుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీదారు ప్రాట్ అండ్ విట్నీ గోఫస్ట్‌కి ఇంజిన్‌లను సరఫరా చేయాల్సి ఉంది. కానీ సమయానికి డెలివరీ చేయలేదు. ఈ కారణంగా గోఫస్ట్ 61-విమానాల్లో సగానికి పైగా నిలిపివేయాల్సి వచ్చింది. విమానాలు నడపకపోవడం వల్ల నగదు సమస్యతో పాటు రోజువారీ కార్యకలాపాలకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. విమానాలు గ్రౌండింగ్ చేయడం వల్ల గోఫస్ట్ మార్కెట్ వాటా జనవరిలో 8.4 శాతం నుండి మార్చిలో 6.9 శాతానికి పడిపోయింది.

ఇది దురదృష్టకరం: కేంద్రమంత్రి

ఇంజిన్ సరఫరాకు సంబంధించిన నిర్వహణ సమస్యలు విమాన సంస్థ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడం దురదృష్టకరమని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. కంపెనీ స్వచ్ఛంద దివాలా పిటిషన్ దరఖాస్తు చేసిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. న్యాయ ప్రక్రియ కోసం వేచివుండడం సరైంది అని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News