రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ బండి సంజయ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు తేదీలు ప్రకటించడం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. లబ్దిదారులకు తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. సోమవారం మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకుని ఈసందర్భంగా మాట్లాడుతూ పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడని ప్రశంసించారు. ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేద వాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలతోపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తప్పకుండా అమలు చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. జన సంఘ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశమంతా జరిగిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా జనతా పార్టీ అలయన్స్ ప్రభుత్వ ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించాడన్నారు. 2 ఎంపీ సీట్లకే పరిమితమైన బిజెపిని ఆ తరువాత ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు అలుపెరగని పోరాటం చేసి మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టి అవినీతి మచ్చలేకుండా నిజాయితీగా, పారదర్శకంగా ప్రజారంజకంగా వాజ్‌పేయి పాలించారని పేర్కొన్నారు.
వాజ్ పేయికి నిజమైన వారసుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ నేడు భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రశంసలు కురిపించారు. రాజకీయ లబ్ది కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్వేత పత్రం, స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుందని మండిపడ్డారు. అలాంటి సంస్దలు ఉగ్రవాదులను తయారు చేయడంతోపాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతుందని నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు.