సుబేదారి: జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కోసం మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తిచేసి జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధృవీకరించాలన్నారు.
దరఖాస్తుతోపాటు జర్నలిస్టు మరణ ధృవీకరణ, ఆదాయ, కుటుంబ ధృవీకరణ పత్రాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలన్నారు. ప్రమాదం బారిన పడిన జర్నలిస్టు లేదా అనారోగ్య కారణాలతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు ఆర్థిక సహాయార్థం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ దరఖాస్తుతోపాటు ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ ఇచ్చిన జర్నలిస్టు పనిచేసే స్థితిలో లేడు అనే సర్టిఫికెట్ వివరాలతో జిల్లా పౌర సంబంధాల అధికారి ధృవీకరణతో పంపాలన్నారు. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సినవసరం లేదన్నారు.
అకాడమి నుంచి లబ్ధి పొందిన వారు, పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తులు ఇవ్వని వారు మాత్రమే తమ దరఖాస్తులను ఈనెల 21 లోపు కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి నంబరు 1021, ఎఫ్‌డీసీ కాంప్లెక్స్, 2వ అంతస్తు, సమాచార భవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్‌లో అందచేయాలన్నారు. అందిన దరఖాస్తులను జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీ పరిశీలించి ఆర్థికసాయాన్ని అందచేస్తుందన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ అధికారి 7702526489ను సంప్రదించాలన్నారు.