Wednesday, January 22, 2025

రాజ్యసభలో ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు ఆమోదం

- Advertisement -
- Advertisement -

ఇక జీ హుజూర్ కమిషనర్ల నియామకం: కాంగ్రెస్

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) నిమాయకం, సర్వీసు నిబంధనలను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. ది చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలెక్షన్ కమిషనర్స్ అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్, 2023 మంగళవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కాగా, ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

తమకు జీహుజూర్ అనే వ్యక్తులను అధికార పార్టీ ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రతిపక్షాలు భయాందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణా వ్యవస్థను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును పురస్కరించుకుని ఈ బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

1991 నాటి చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఈ ఏడాది ఆగస్టు 10న ప్రభుత్వం ఒక బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఇప్పటికీ ఆ బిల్లు ఆమోదం పొందలేదు. 1991 నాటి చట్టంలో సిఇసి, ఇసిల నియామకానికి సంబంధించిన నిబంధనలు లేవు. పాత చట్టం ప్రకారం సిఇసి, ఇసిల నిమాయకాలు ప్రభుత్వమే నిర్ణయించేదని, కాని ఇప్పుడు ఒక సెర్చ్, సెలెక్ట్ కమిటీ నియామకం జరిగిందని, సిఇసి, ఇసిల జీతాలకు సంబంధించిన అంశాలను కూడా సవరణ ద్వారా బిల్లులో పొందుపరచడం జరిగిందని మేఘావల్ తెలిపారు. తమ బాధ్యతల నిర్వహణకు సంబంధించిన చర్యల విషయంలో సిఇసి, ఇసిలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి బిల్లులో ఒక నిబంధనను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు.

కాగా..ప్రతిపాదిత బిల్లు రాజ్యాంగంలోని 14వ అధికరణ స్ఫూర్తికే విఘాతం కలిగించే విధంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జీవాలా విమర్శించారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ గుప్పిట్లో చిక్కుకుంటుందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది పూర్తిగా విరుద్ధమని ఆయన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆరోపించారు. ప్రతిపాదిత చట్టాన్ని అచేతన నవజాత శిశువుగా ఆయన అభివర్ణించారు. నియామక కమిటీ కూడా కేవలం లాంఛనప్రాయమేనని, అందులో ప్రధాని, ఆయన నామినేట్ చేసే వ్యక్తులు సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ సభ్యుడు విమర్శించారు.

దేశంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించే ఏకైక వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ స్వతంత్రంగానే కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఉండడం కేంద్రానికి ఇష్టం లేదని, ఎన్నికల కమిషన్‌ను తన చెప్పుచేతలోల్లో ఉంచుకోవడానికే ప్రతిపాదిత చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు.

ఒకప్పుడు ఇసి అంటే ఎలెక్టోరల్ క్రెడిబిలిటీ(ఎన్నికల విశ్వసనీయత)గా చెప్పుకునేవారని, కాని దురదృష్టవశాత్తు దాన్ని ఎలెక్షన్ కాంప్రమైస్డ్(ఎన్నికల రాజీ)గా మార్చాలని మీరు నిర్ణయించుకున్నారని ఆయన ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచారు. ఆమ్ ఆదీమ పార్టీ సభ్యుడు రాఘవ్ ఛద్దా కూడా బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడానికి ప్రయత్నించడం అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News