Thursday, January 23, 2025

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘తెలంగాణ మోడల్’కు మన్ననలు

- Advertisement -
- Advertisement -
  • అన్ని రంగాలలో మేడ్చల్ జిల్లా అభివృద్ధ్ది
  • మంత్రి చామకూర మల్లారెడ్డి
  • మేడ్చల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

మేడ్చల్ జిల్లా: తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్నలు పొందుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధ్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు రూ.18,35,33000 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును, 176 స్వయం సహాయక సంఘాలలోని 1,978 వీధి వ్యాపారుల కోసం మెప్మా వారికి రూ.16.61 కోట్ల రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాప్రతాలు అందజేశారు. అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులతో కలిసి కీసరలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి అదర్శంగా నిలిచిందని, ‘తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకునే స్థాయికి చేరిందన్నారు.

అన్ని రంగాలలో మేడ్చల్ జిల్లా అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మేడ్చల్ జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రభుత్వం సమర్ధత, ప్రణాళికలతో దశల వారీగా పలు వ్యవసాయ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుండటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. 2016, 17 సంవత్సరంలో 30,361 ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2022,23 సంవత్సరంలో 51,852 ఎకరాలకు విస్తరించి 71 శాతం వృద్ధి సాధించిందని మంత్రి చెప్పారు. రైతుబంధు ద్వారా 2018, 19 నుండి 2022, 23 వరకు జిల్లాలో 44,792 మంది రైతులకు సుమారు రూ.343 కోట్లు రైతుబంధు పథకంలో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

రైతు జీవిత బీమా పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 438 ప్రతిపాదనలు రాగా రూ.21.70 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. పంట నిల్వల కోసం శీతల గిడ్డంగుల నిర్మాణానికి 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటి వరకు 6 శీతల గిడ్డంగులు, ఒక రైపెనింగ్ ఛాంబర్ నిర్మాణానికి రూ.3.69 కోట్లు సబ్సిడీ కింద ఇచ్చామన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధి లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. టిఎస్ ఐపాస్ కింద 4809 పరిశ్రమలు రూ.10,169 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడ్డాయని, సుమారు 1.8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. టిఎస్ ఐపాస్ అమలులో మేడ్చల్ జిల్లా 2019 సంవత్సరానికి ఉత్తమ జిల్లా అవార్డు అందుకుందని మంత్రి గుర్తు చేశారు.

జిల్లాలో 13 ప్రాథమిక, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక ఏరియా ఆసుపత్రి, 94 బస్తీ దవాఖానాలు, 33 ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారాప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 27.03 లక్షల మందికి ఆరోగ్య సేవలు అదాయన్నారు. జిల్లాలోని 105 కేంద్రాలలో తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా 52 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు 4.23 లక్షల మంది రోగులకు ఉచితంగా పరీక్షలు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో సుమారుగా వేయి శాతం ఆసరా పెన్షన్లు పెరిగాయని చెప్పారు. 1.48 లక్షల మందికి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు సంవత్సరానికి రూ.439.44 కోట్లు చెల్లించడం జరగుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రం సిద్ధించాక జిల్లాలోని 3370 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలతో ఒక్కో సంఘానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.732.97 కోట్ల బ్యాంకు రుణాలు, 3374 సంఘాలకు రూ.27.30 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు అయ్యాయని అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలోని 31 గ్రామ పంచాయతీలకు అన్ని సౌకర్యాలు సమకూరాయని, వైకుఠ ధామాలు, 81 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని అన్నారు. ధీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు, మూడుచింతలపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయి అవార్డు పొందినందుకు సంతోషిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 2017 సంవత్సరం నుండి 45,451 గృహాలకు రోజుకు వంద లీటర్ల చొప్పున తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.

జిల్లాలో రహదారుల అభివృద్ధి, పాత రహదారుల నిర్మాణం విస్తరణకు రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.293 కోట్లు, మరమ్మతులకు రూ.55 కోట్లు, సీఎం హామీ పనుల కింద రూ.9.75 కోట్లు, అండర్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.100.50 కోట్లు, జవహర్‌నగర్ పరిధిలో డిఎంఎఫ్‌టి పథకంలో రూ.6.9 కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడ్డాయని అన్నారు. జిల్లాలోని అన్ని నగర పాలక, పురపాలక సంఘాలు ఓడిఎఫ్ ++ గా గుర్తింపు పొందాయని, రూ.1500 కోట్ల 86 లక్షలతో రోడ్లు, భూగర్బ మురుగు కాలువల నిర్మాణాలు, వైకుంఠ ధామాలు తదితర అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి తెలిపారు. జిల్లాలోని ఫీర్జాదిగూడ నగర పాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ నగర పాలక సంస్థగా గుర్తించబడిందని, ఘట్‌కేసర్ పురపాలక సంఘం కేంద్ర ప్రభుత్వ స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు పొందిందని అన్నారు.

పోచారం పురపాలక సంఘం హరితహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టణ ప్రగతి పురస్కారం పొందిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కలెక్టరేట్ ఏవో వెంశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News