అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ఈనెల 27 రానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లపై సిఎస్ వివిధ శాఖల అధికారులతో శనివారం డా. బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడంతో పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు బ్యాండ్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత, ట్రాపిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్య, రోడ్లభవనాలు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పర్యటన సజావుగా జరిగేలా చూడాలని కోరారు.
ఈసమావేశంలో డిజిపి రవిగుప్తా, అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి, ప్రభుత్వకార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్‌ఎంసీ కమిషన్ రోనాల్డ్ రోస్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జోంగ్తు, సెక్రటరీ ఆర్ అండ్ బి శ్రీనివాస్‌రాజు, సిఎండి టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ముషారప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.