మనతెలంగాణ/ హైదరాబాద్ : చేనేత వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ విలియమ్స్ హౌవో ఫిబ్రవరి 28న కుట్టుమిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్ అందరికీ గుర్తింపు లభించిందన్నారు. అంతర్జాతీయ టైలర్స్‌డే సందర్భంగా మేరు కులస్థులకు, టైలర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మేరు కులస్తులకు సిఎం కెసిఆర్ ఉప్పల్ భగాయత్‌లో ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు కేటాయించారని గుర్తుచేశారు. బిసిల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ టైలర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిఎం కెసిఆర్ బిసిలకు సమగ్ర న్యాయం చేయగలరని అన్నారు. బిసి కులానికి ఆత్మగౌరవం చేకూరేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపడుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, దీకొండ నర్సింగరావు, వెంకటేష్ పాల్గొన్నారు.