Wednesday, January 22, 2025

బిహార్ కుల గణనకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

మీది ఏ కులమో మీ పొరుగు వారికి తెలిసిపోతున్నప్పుడు బీహార్ ప్రభుత్వం జరిపిన కుల గణనను వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు ఉల్లంఘన ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అప్పుడెప్పుడో 1931లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చిట్టచివరిగా జాతీయ స్థాయిలో కులాలవారీ జన గణనను చేపట్టింది. ఆ తర్వాత కులరహిత సమాజ నిర్మాణం ఒక ఆదర్శంగా బలపడి ఆ ప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ ఆగిపోయింది. అయితే వాస్తవంలో కులం ఒక కఠోర సత్యంగా మిగిలిపోయింది. వివాహాది సంబంధాలు ఇప్పటికీ కుల ప్రాతిపదిక మీదనే జరుగుతున్నాయి. దేశ జనాభా జాతీయ స్థాయి చట్రంలో ఇమడడానికి బదులు కులాలవారీగా చీలిపోయి ఇప్పటికీ కులానికే బద్దమై వుంది. అందుచేత కుల సమాజంలో కుల జన గణన జరపడంలో అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న దొలుస్తున్నది. రాజ్యాంగంలో పొందు పరిచిన రిజర్వేషన్లు 80% పైగా వున్న కింది వర్గాల ప్రజల పరిపూర్ణ అభివృద్ధికి, వికాసానికి తోడ్పడడం లేదు.

ఇదే సమయంలో తమకూ కోటా కావాలనే ఆందోళనలు పై వర్గాల నుంచి ఒక పద్ధతిగా దూసుకు రావడంతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించి దానికి రాజ్యాంగ కవచాన్ని కూడా తొడిగింది. దానితో సామాజికంగా వెనుకబడిన వర్గాలు కులాల ప్రాతిపదికపై జనాభా లె క్కల సేకరణను మరింతగా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అగ్ర వర్ణాలకు రాజ్యాంగంలో లేని రిజర్వేషన్ల అవకాశాన్ని కల్పించడానికి తొందరపడిన భారతీయ జనతా పార్టీ కుల గణన డిమాండ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. నితీశ్ కుమార్ ఎన్‌డిఎలో భాగంగా బీహార్ సిఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే ప్రతిపక్ష నేత, ఆర్‌జెడి సారథి తేజస్వి యాదవ్‌ను వెంటబెట్టుకొని ప్రధాని మోడీని కలిసి కులాలవారీ జనాభా సేకరణను డిమాండ్ చేశారు. అటువంటి జన గణన తమ పట్టులో గల వెనుకబడిన తరగతులను తమకు దూరం చేస్తుందనే భయంతో మోడీ అందుకు సంసిద్ధతను వ్యక్తం చేయకుండా మౌనం పాటించారు.

నితీశ్ కుమార్ బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ నుంచి బయటపడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ చేపట్టిన తర్వాత తన రాష్ట్రంలో కుల జన గణనను జరిపించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దానిని సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను పాట్నా హైకోర్టు విచారణకు స్వీకరిస్తూ కులాలవారీ జనాభా సేకరణను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ నెల 1న పాట్నా హైకోర్టు తుది తీర్పు ఇస్తూ కుల గణన సరైనదేనని, న్యాయ సమ్మతమైనదేనని ప్రకటించి దానిపై దాఖలైన పిటిషన్లన్నింటినీ రద్దు చేసింది. దానితో పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. సేకరించిన కులాలవారీ జనాభా లెక్కలను రికార్డుకెక్కించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు అనుమతి ఇచ్చింది. పిటిషనర్లు కోరినట్టు వాటి ప్రచురణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వ్యక్తుల కులానికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడం జరగదని, అదే సమయంలో ఆ కులానికి చెందిన వారు ఎంత మంది వున్నారో బహిర్గతం చేయడం జరుగుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

అటువంటప్పుడు వ్యక్తిగత గోప్యతా హక్కుకి కలగబోయే నష్టం ఏమీ వుండదని జస్టిస్ ఖన్నా అభిప్రాయపడ్డారు. కుల గణనను వ్యతిరేకించిన యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌జిఒ) తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ సిఎస్ వైద్యనాథన్ తమ కులాన్ని బయటపెట్టాల్సిందిగా ఎవరిపైనా వత్తిడి కలిగించరాదని పేర్కొన్నారు. అప్పుడు నీ కులం నీ పొరుగువారికే తెలిసిపోతున్నప్పుడు కుల గణన వ్యక్తుల గోప్యతా హక్కుకు ఏ విధంగా ప్రమాదకారి కాగలదని న్యాయమూర్తి ఖన్నా ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల జన గణనలో భాగంగా అక్కడి ప్రజలను 17 ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి కులానికి సంబంధించినది. అంటే భిన్న కులాల ప్రజలు ఎటువంటి సామాజిక, ఆర్థిక స్థితిలో వున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఇది ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మున్నగు సాయాలు అందించడంలో ఇప్పటి కంటే ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతుంది.

ఈ సమాచారం లేకపోడం వల్లనే వెనుకబడిన తరగతుల జనాభా 50 శాతానికి పైగా వుంటే వారికి 27% రిజర్వేషన్లు మాత్రమే కల్పిస్తున్నారు. గతంలో 1968లో కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సర్వే జరిపించింది. స్వాతంత్య్రానంతరం జరిగిన ఈ మొట్టమొదటి సర్వేలో కేరళలో అగ్రవర్ణాలకు చెందినవారు 33% మంది వున్నారని వారు ధనవంతులని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News