కరోనా విజృంభన నేపథ్యంలో ఎన్‌టిఎ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూడవ విడత జెఇఇ మెయిన్ వాయిదా పడింది. జాతీయ విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటిల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టిఎ ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ రమేష్ పోఖ్రియాల్ ధృవీకరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. సిబిఎస్‌ఇ పరీక్షల రద్దు అనంతరం జెఇఇ మెయిన్ పరీక్షను కూడా వాయిదా వేయాలనే డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఎన్‌టిఎ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఈసారి నాలుగు సెషన్లుగా జెఇఇ మెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి సెషన్లలో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించారు. మూడవ విడతగా జరగాల్సిన ఏప్రిల్ సెషన్‌ను వాయిదా వేశారు. తదుపరి జెఇఇ మెయిన్ పరీక్ష తేదీని పరీక్షకు 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు.