రిజర్వాయర్ల వద్ద ఇతరులకు ప్రవేశం లేదు
కొత్త సెక్యూర్టీ గార్డులను నియమించిన జలమండలి అధికారులు
హైదరాబాద్ : నగరంలోని పలు రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతను కట్టుదిట్టం చేసింది. వాటి వద్ద నిరంతరం పహారా ఉంచేందుకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కొత్తగా 100మంది సెక్యూర్టీ గార్డులను నియమించింది. వీరంతా నగరంలోని వివిధ రిజర్వాయర్ల వద్ద 24 గంటల పాటు విధులు నిర్వహించనున్నారు. వీరు జలమండలి విజిలెన్స్ విభాగంతో పటు స్థానిక పోలీసుల సమన్వయంతో కలిసి పని చేయనున్నారు. కొత్త సెక్యూర్టీ గార్డులకు శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్. ఎం .సత్యనారాయణ మాట్లాడుతూ రిజర్వాయర్లవద్దకు బయటి వ్యక్తును ఎట్టిపరిస్ధితుల్లో అనుమతించవద్దని సెక్యూర్టీ సిబ్బందికి సూచించారు.
అయితే జలమండలి వినియోగదారులు, సాధారణ ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు మాత్రం కార్యాలయ సమయాల్లో అధికారులను కలిసేందుకు వెసులు బాటు ఉంటుందన్నారు. రిజర్వాయర్ ప్రాంగణాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే జలమండలి విజిలెన్స్ విభాగానికి లేదా స్థానిక పోలీసులకు వెంటనే సమాచారాన్ని అందించాలన్నారు.అందరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం కొత్త సెక్యూర్టీ గార్డులు ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు మార్చ్‌ఫాస్స్ నిర్వహించి ఆయా రిజర్వాయర్ల వద్ద విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరక్టర్లు అజ్మీరా కృష్ణ,స్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్ రెడ్డి, సీజిఎం విజయరావు, ఏజైల్ సెక్యూర్టీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.