Saturday, December 21, 2024

అత్యాచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో ఎఆర్ కానిస్టేబుల్‌ను పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…రాజ్‌భవన్‌రోడ్డు, ఎంఎస్ మక్తాకు చెందిన యువతి(21)కు కామన్ ఫ్రెండ్ ద్వారా ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిఖిల్ నాలుగేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. ఇద్దరు స్నేహితులుగా మారారు, ఈక్రమంలోనే వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నిఖిల్ చెప్పడంతో యువతి నమ్మి ప్రేమించింది. నవంబర్ 21, 2020, తన పుట్టిన రోజు అని, బయట కలుద్దామని చెప్పాడు. నిందితుడి మాటలు నమ్మిన యువతి నిఖిల్‌తో వెళ్లగా ఓ రూముకు తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటానని చెప్పి శారీరకంగా కలిశాడు. అప్పటి నుంచి యువతిని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు.

వివాహం చేసుకోమని యువతి డిమాండ్ చేసిన ప్రతిసారి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో యువతి ఆరా తీయగా మరో యువతితో నిఖిల్‌కు సంబంధం ఉందని తెలిసింది. అప్పటి నుంచి బాధితురాలు నిఖిల్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. రెండున్నర నెలల క్రితం తన ఇంటికి రావాలని మాట్లాడుకుందామని చెప్పడంతో యువతి నమ్మి వెళ్లింది. ఇంట్లోనే బాధితురాలిపై కానిస్టేబుల్ అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా నిరాకరించాడు. తాను పోలీస్‌నని తనను ఎవరూ ఏమి చేయలేరని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా విషయం తెలుసుకున్న నిఖిల్ వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భస్రావం చేయించాడు. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతుండగా బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News