Wednesday, January 22, 2025

భూతాపం.. ఓ సముద్రానికి శాపమైంది!

- Advertisement -
- Advertisement -

అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో దుమ్ము, ఉప్పు తుఫానుల సంఖ్య బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏటా పది పెద్ద దుమ్ము తుఫానులు సంభవిస్తున్నాయని, వాటిలో ఎక్కువ భాగం ఏప్రిల్, జులై నెలల మధ్య సంభవిస్తున్నాయని ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం చరిత్ర మనకు ఒక పాఠం చెబుతుంది. మనం ప్రకృతిని అతిగా వినియోగించుకుంటే, దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

నిత్యజీవితంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తాయి, కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. నేను చెప్పబోయేది మనందరినీ ఆశ్చర్యపరిచే, ఆలోచింపజేసే అలాంటి ఒక సంఘటన. సహజంగా చెరువులు, నదులు ఎండిపోవడాన్ని మనం కొన్నిసార్లు వింటాం లేదా చూస్తాం. కానీ సముద్రం ఎండిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద అంతర్గత నీటివనరు, పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన అరల్ సముద్రం నేడు కనుమరుగైంది అనే విషయం అందరినీ ఆలోచింపజేస్తుంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న అరల్ సముద్రం 26,300 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో నిత్యం చేపలతో కళకళలాడుతూ ఆర్ధిక వ్యవస్థకు ఎన్నుదన్నుగా నిలిచింది.

అలాంటి సముద్రం గ్లోబల్ వార్మింగ్, అభివృద్ధి ప్రతికూల ప్రభావాల కారణంగా ఈ సరస్సు 1960 నుండి తగ్గిపోతూ 2010 నాటికి పూర్తిగా ఆవిరైందని పరిశోధకులు కనుగొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. 1960లో అరల్ సముద్రం ఉపరితలం సముద్రమట్టానికి 175 అడుగుల (53 మీ) ఎత్తులో ఉంది. సుమారుగా 26,300 చదరపు మైళ్ళు (68,000 చదరపు కిమీ) విస్తీర్ణంలో ఉంది. అరల్ సముద్రం ఉత్తరం నుండి దక్షిణానికి 270 మైళ్ళు (435 కిమీ), తూర్పు నుండి పడమరకు 180 మైళ్ళు (290 కిమీ) ఉంది. అరల్ సముద్రం అదృశ్యం కావడానికి ప్రధాన కారణం సోవియట్ యూనియన్ ఆర్థిక విధానాలు సిర్ దర్యా, అము దర్యా నదుల నీటిని సాగునీటి ప్రాజెక్టుల కోసం, వ్యవసాయ అవసరాల కోసం మళ్లించడం వలన అరల్ సముద్రం నీటిమట్టం క్రమపద్ధతిలో భారీగా తగ్గింది. ఈ రెండు నదులు అరల్ సముద్రానికి ప్రధాన నీటివనరులు.

అందువల్ల నదుల నుండి నీరు రాకపోవడంతో సముద్రం ఎండిపోవడానికి ప్రధాన కారణం. సోవియట్ ప్రభుత్వం ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో పెద్ద ఎకరాల పచ్చిక బయళ్లను లేదా సాగు చేసిన భూములను అము దర్యా, సిర్ దర్యా, వాటి ఉపనదుల జలాలను ఉపయోగించడం ద్వారా సాగునీటి వ్యవసాయ భూములుగా మార్చింది. 1980ల చివరి నాటికి సరస్సు 1960కి ముందు ఉన్న దాని పరిమాణంలో సగానికి పైగా కోల్పోయింది. ఫలితంగా సరస్సులోని ఉప్పు, ఖనిజాలు మరింత కేంద్రీకృతమయ్యాయి. సముద్రంలో నీరులేని కారణంగా ఇరు రాష్ట్రాలు తీవ్రనీటి సమస్యను ఎదుర్కొన్నాయి. నీటి సమస్యను పరిష్కరించేందుకు 1994లో కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్థాన్‌లతో కలిపి అరల్ సముద్రాన్ని రక్షించే ప్రయత్నాలను చేపట్టినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అరల్ సముద్రం నీటిమట్టం 2006, 2009 నాటికి నాలుగైదు వంతులు తగ్గింది. సముద్రం ఉత్తరభాగాన్ని రక్షించడానికి ప్రపంచ బ్యాంకు, కోక్- అరల్ డ్యామ్ నిర్మాణానికి సిర్ దర్యా వెంబడి ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి.

అయితే, దక్షిణ భాగం-, తూర్పు, పశ్చిమ లోబ్‌లు కానీ ముఖ్యంగా తూర్పు- ఉత్తరం -కొంత నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, కుంచించుకుపోతూనే ఉంది. 2010 తర్వాత చాలా కాలం పాటు తూర్పు లోబ్ పూర్తిగా ఎండిపోయింది.అరల్ సముద్రం ఎండిపోవడంతో మత్స్య సంపద, వాటిపై ఆధారపడిన వర్గాలు కుప్పకూలాయి. పెరుగుతున్న ఉప్పునీరు ఎరువులు, పురుగుమందులతో కలుషితమైంది. వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన, బహిర్గతమైన సరస్సు అడుగుభాగం నుండి వీచే దుమ్ము ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది. సముద్రాలు, వాటి లోపల సరికొత్త ప్రపంచాన్ని కలిగి ఉన్నాయి. లోతైన సముద్రంలో ఉండే జీవులు చాలా అరుదు, అందంగా ఉంటాయి.

కానీ అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల చమత్కారమైన సముద్ర జీవులు నష్టపోయాయి. సముద్రం ఎండిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు, వారు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సరస్సు. ప్రధానంగా మంచు కరగడం, సుదూర పర్వతాల నుండి కురిసే అవపాతం కారణంగా, అరల్ సముద్రం విస్తృతమైన మత్స్యకార సంఘాలకు, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లోని చాలా శుష్క ప్రాంతంలోని సమశీతోష్ణ ఒయాసిస్‌కు మద్దతు ఇచ్చింది. కానీ 1950లు, 60లలో సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన నదులైన సిర్ దర్యా, అము దర్యాలను మళ్లించే ప్రాజెక్టులను ప్రారంభించింది. అప్పటి నుండి అరల్ సముద్రం నెమ్మదిగా కనుమరుగవుతోంది.

కోట దామోదర్
9391480475

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News