ఎయిర్‌పోర్టు, జూపార్కు వైపు
తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్‌లోని మరో పొడవైన వంతెన ఆరాంఘర్ ఫ్లైఓవర్ నేడు ప్రారంభం కానున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు సా. 4 గం.లకు ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసి సన్నాహాలు చేసింది. జూపార్కు నుండి ఆరాంఘర్ వరకు చేపట్టిన 6 లేన్ల ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ. 799.74 కోట్లు. పొడవు 4 కి.మీ.లు. వెడల్పు 23 మీ.లు. 2024,డిసెంబర్ 8న ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది.
వచ్చే 20 సంవత్సరాలకు ఈ ప్రాంతంలోని ట్రాఫిక్ రద్దీని దృష్టిలోపెట్టుకుని ఈ ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసి నిర్మించింది. ఈ వంతెన ఏర్పాటుతో శాస్త్రీపురం, కాలాపత్తర్, దరుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్‌నగర్ కూడలి, శంషాబాద్ ఏయిర్‌పోర్టు, జూపార్కుకు మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాలకు ట్రాఫిక్ సమస్య సమసిపోతుంది. ఈ వంతెన ద్వారా సమయం, ఇంధనం కలిసి వస్తుంది. ఆరాంఘర్ వైపు, జూపార్కు వైపు ప్రత్యేకంగా ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు.
ఎస్‌ఆర్‌డిపిలో..
గ్రేటర్ నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే క్రమంలో ఎస్.ఆర్.డి.పి పథకాన్ని జీహెచ్‌ఎంసి అమలు పరుస్తుంది. ఈ పథకంలో భాగ ంగా 42 పనులను చేపట్టి ఇప్పటి వరకు 36 ప నులు పూర్తిచేసింది. మరో 6 పనులు చేపట్టాల్సి ఉంది. ఆరాంఘర్ ఫ్లై ఓవర్ పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత రెండో పొడవైన ఫ్లై ఓవర్ గా ఇది నిలుస్తుంది. గ్రేటర్‌లో ఈ వంతెన 23 వది. మహాత్మాగాంధీ (ఇమ్లిబన్) బస్ స్టేషన్ నుండి కర్నూలు వైపుగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రవేటు బస్సులు ఇతర వాహనాలకు సౌలభ్యం ఏర్పడనుంది. అయితే,ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన మిగిలిన పనులు ఇరువైపుల ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి, 2025 నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
ఎస్.ఆర్.డి.పిలో చేపట్టిన 42 పనులలో 22 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్ లు, 6 ఆర్‌ఓబిలు మరో మూడు వివిధ రకాల పనులు ఇప్పటికే జీహెచ్‌ఎంసి పూర్తిచేసింది. నగరంలో వ్యూహాత్మక పధకాలను ఒకే గొడుగు క్రిందికి తెచ్చి సమగ్ర ప్రగతి చేసేందుకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకంను ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెచ్‌సిటీలో రూ.7032 కోట్లతో 38 పనులను చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చింది. సుమారు 38 పనులు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అర్‌ఓబిలు ఈ పథకంలో చేపట్టనున్నారు.