న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మె రుగైన ప్రదర్శనతో అలరించిన భారత యువ టిటి క్రీడాకారిణి అర్చనా కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. 24 ఏళ్లకే టిటికి రిటైర్మెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్చనా కామత్ మెరుగైన ఆటతో జట్టును క్వార్టర్ ఫైనల్‌కు చేర్చడంలో ముఖ్య భూమిక పోషించింది. పారిస్ గేమ్స్ తర్వాత ప్రొఫెషనల్ టిటికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది. ప్రధాన కోచ్ అన్షుల్ గార్గ్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అర్చన ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండడంతో పాటు ఆర్థిక అవసరాల దృష్టా ఆట నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి అర్చన వచ్చింది.
ఈ విషయాన్ని ఆమె కోచ్ గార్గ్ గురువారం వెల్లడించారు. టిటికి రిటైర్మెంట్ ప్రకటించిన అర్చన విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తోంది. ఆమె నిర్ణయాన్ని తాను స్వాగతించానని గార్గ్ పేర్కొన్నారు. ఇతర క్రీడలతో పోల్చితే టిటిలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్నారు. ఇలాంటి స్థితిలో ఎవరూ కూడా పెద్దగా ఈ ఆటపై ఆసక్తికనబరచడం లేదని వాపోయారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా ఇప్పట్లో భారత్ ఒలింపిక్స్ వంటి మెగా క్రీడల్లో పతకం సాధించడం దాదాపు అసాధ్యమని గార్గ్ పేర్కొన్నారు.