Sunday, January 19, 2025

మోడీ గ్యారెంటీలకు గ్యారెంటీ ఉందా?-2

- Advertisement -
- Advertisement -

సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం నుండి లబ్ధి పొంది తాము సంపాదించిన లాభాలను, సంపదను తిరిగి బ్యాంకులలో దాచుకుంటారనీ, ఆ సొమ్ము నుండి అవసరం ఉన్న సాధారణ ప్రజలకు రుణాలు అందిస్తారనీ ప్రజలంతా భావిస్తారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా కార్పొరేట్ కంపెనీలే బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొంటున్నాయి. వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొడుతున్నాయి. కొన్ని కంపెనీలు, వ్యాపారవేత్తలు దివాలా తీసినట్లుగా ప్రకటించి అసలు, వడ్డీలు కట్టకుండా విదేశాలకు పారిపోయారు. వీరిలో 99 శాతం గుజరాతీ వ్యాపారులే ఉన్నారు.

ఈ ప్రజాధనం బ్యాంకుల నుండి లూటీ చేసిన వారిని ఎక్కడ దాక్కున్నా అరెస్టు చేసి పట్టి తెస్తామని, వారి నుండి అణాపైసలతో సహా రాబడతామని, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని, బహిరంగ వేలం వేస్తామని మోడీ నమ్మకంగా వాగ్దానం చేశారు. కానీ గత పదేళ్ళలో జరిగిందేమిటో ప్రజలకు తెలుసు. ఇలా బ్యాంకులను మోసగించి దోచుకున్న సొమ్మును ఎగవేసిన వారి రుణాలను, వడ్డీలను రిజర్వు బ్యాంకుపై మోడీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మాఫీ చేస్తున్నాయి.గత పదేళ్ళలో మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు చెందిన రూ. 30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి చరిత్ర సృష్టించింది.

ఈ రూ. 30 లక్షల కోట్లు ప్రజల సొమ్ముకాదా?పైగా ఈ ప్రబుద్ధులకే తిరిగి రుణాలు ఇవ్వాలని బ్యాంకులపై ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. అందుకే రిజర్వు బ్యాంక్ గవర్నర్లు కొందరు కేంద్ర ప్రభుత్వంతో రాజీపడలేక రాజీనామాలు చేశారు. అంతేకాదు, కొన్ని కార్పొరేట్ సంస్థలకు గత పదేళ్ళలో రూ. 55 లక్షల కోట్ల పన్నుల రాయితీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

పైగా 2024 -2025 బడ్జెట్ లో కార్పొరేట్ కంపెనీలపై పన్నును 33 శాతం నుండి 25 శాతానికి తగ్గించింది. ఇటువంటి మోడీ ప్రభుత్వం ఆర్ధిక విధానాలను కొందరు కుహనా మేధావులు సమర్ధించటం శోచనీయం. కార్పొరేట్ వర్గాలకు దేశ సంపదను ప్రభుత్వం దోచిపెడితే పర్వాలేదు. ప్రైవేటు వ్యాపార రంగాన్ని, కార్పొరేటు రంగాన్ని ప్రోత్సహించవలసిందేనని కొందరు ఆర్ధిక నిపుణులు లేదా ప్రభుత్వ సలహాదారులు సమర్ధిస్తారు. కానీ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, పేదలకు, వితంతువులకు, వికలాంగులకు మొదలైన వారికి పెన్షన్లు ఇవ్వడం, రైతులకు రుణాలు మాఫీ చేయటం, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం మాత్రం ప్రజాధనం వృథా చేయటంగా వారు గగ్గోలు పెడతారు.

2014 బిజెపి ఎన్నికల ప్రణాళికలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామనీ, పేద కుటుంబాలకు ఉచితం గా గ్యాస్ సిలిండర్ అందిస్తామని అనేక గ్యారంటీ హామీలు ఇచ్చారు. కాని గత పదేళ్ళలో అన్ని నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉదా॥ గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 410 నుండి రూ. 906కు పెరిగింది. నిజానికి సిలిండర్ ధర రూ. 1200 చేరుకుని ఎన్నికల సమయం కనుక తాత్కాలికంగా కొంత తగ్గించారు. ఎన్నికల తరువాత వడ్డీతో సహా మరోసారి ధరా ఘాతం తప్పదు. డీజిల్ ధర 2014 లో లీటర్‌కు రూ. 62 నుండి 2024లో రూ. 93 లకు పెరిగింది. అలాగే పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 72 నుండి రూ. 106 లకు పెరిగాయి. వంట నూనె ధర కిలో రూ. 80 నుండి రూ. 160లకు, గోధుమపిండి ధర కిలో రూ. 35 నుండి రూ. 60లకు, కంది పప్పు ధర కిలో రూ. 75 నుండి రూ. 150లకు పెరిగాయి.

ఇవే కాదు హోటళ్లలో రూముల కిరాయిలు, బస్ ఛార్జీలు, కూరగాయల ధరలు, మాంసం, చేపలు, సిమెం ట్, ఇనుము, స్కూల్ ఫీజులు, ఆసుపత్రి బిల్లులు ఇలా ప్రతిదీ అద్దూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ధరలను అదుపు చేయలేక చతికిలపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్లనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మోడీ ప్రభుత్వం చెబుతుంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో 2014లో 110 డాలర్లు ఉన్న ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 2023 నాటికి 76 డాలర్లకు పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్స్ పై తిరిగి చెల్లింపుల వల్ల కూడా ఈ ధరలు పెరుగుతున్నాయని మరో అబద్ధం గట్టిగా చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. ఉక్రేయిన్, రష్యా యుద్ధ సమయంలో రష్యా నండి యూరపు, గల్ఫ్ దేశాల కంటే తక్కువ ధరకే క్రూడాయిల్ భారత్ దిగుమతి చేసుకుంది. ఇండి యా రూపీ కన్వర్షన్ కూడా రష్యా అంగీకరించింది. అయినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.

మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌పై పన్ను లీటర్‌కు రెండు రెట్లు అంటే 9.48 శాతం నుండి 19.98 శాతానికి, డీజిల్ పై పన్ను లీటర్‌కు ఐదు రెట్లు అంటే 3.56 శాతం నుండి 15.58 శాతానికి పెరిగాయి. అలాగే ఒక ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ రూ. 500 తగ్గిపోయింది. అలాగే ఉప్పు, పప్పు, బియ్యం, గోధుమలు, వంట నూనెలతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. షుగర్, బిపి మొదలైన నిత్యం వాడే మందుగోలీల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇతర సరకులపై కనీసం 12 % నుండి 18 % వరకూ జిఎస్‌టి విధించారు.

కాగా, సంపన్నులు వాడే కార్ల లాంటి విలాస వస్తువులపై మాత్రం కేవలం 4% జిఎస్‌టి విధిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమో మోడీనే చెప్పాలి. అత్యంత ఖరీదైన డైమండ్స్‌పై కేవలం 1.5% జిఎస్‌టి మాత్రమే విధిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగడంతో రవాణా ఛార్జీలు విపరీతంగా పెరగటంతో దాని ప్రభావం అన్ని సరుకుల ధరల పెరుగుదలపై పడింది. పైగా సరుకుల ఉత్పత్తి కంపెనీలపైనే కాక కొనుగోలు చేసే వినియోగదారులపై కూడా ఈ ప్రభుత్వం జిఎస్‌టి భారం మోపింది.పెట్రోల్‌పై పన్నులు పెంచడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ. 26.74 లక్షల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. అన్ని రకాల సరుకులపై జిఎస్‌టి విధింపు ద్వారా మోడీ ప్రభుత్వం అదనంగా రూ. 31.25 లక్షల కోట్ల ఆదాయం పొందింది. అంటే ఈ రెండు రకాల పన్నుల ద్వారా మొత్తం మోడీ ప్రభుత్వానికి వచ్చిన అదనపు ఆదాయం 58 లక్షల కోట్లు.

కరోనా సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఉచితంగా వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు కేవలం రూ. 36,500 కోట్ల రూపాయలు మాత్రమే. కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా వేయలేదు.కొన్ని చోట్ల సింగిల్ డోస్ మాత్రమే ఉచితంగా వేశారు. కేవలం రూ. 150 లకే తయారైన వ్యాక్సిన్‌ను రూ. 600 నుండి రూ. 700 లకు ధరను పెంచి వ్యాక్సిన్ అమ్ముకోవడానికి సిరం ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వ్యాక్సిన్ అమ్మకాల ద్వారా వేల కోట్లు లాభాలు ఆర్జించిన ఈ సంస్థ యజమాని ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంపద కలిగిన కుబేరులలో ప్రముఖుడయ్యాడు.

అందుకు ప్రతిఫలంగా బిజెపికి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆ కంపెనీ రూ. వేయి కోట్లు సమర్పించుకుంది. కోవిడ్ సమయంలో మన దేశ వైద్య, ఆరోగ్య శాఖ ఎంత బలహీనంగా ఉందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. కోవిడ్ రోగుల సంఖ్య కు సరిపడిన ఆసుపత్రులు, మందులు, బెడ్స్, ఆక్సిజెన్, విద్యుత్, మంచినీరు, పారిశుధ్యం మొదలైన మౌలిక వసతుల కొరత కొట్టవచ్చినట్లు కనిపించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు ఆరు లక్షల మంది కోవిడ్‌తో మరణించారు.
పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందించడానికి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వానికి అయిన మొత్తం ఖర్చు కేవలం రూ. 4.6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. పెట్రోలియం బాండ్స్‌పై రుణాలు చెల్లించడానికి ప్రభుత్వానికి అయిన ఖర్చు కేవలం రూ. 1.03 లక్షల కోట్లు మాత్రమే.

పెట్రోలియం బాండ్స్ రుణాల చెల్లింపు రూ. 1.03 లక్షల కోట్లు, ఉచిత వ్యాక్సిన్ రూ. 36,500 కోట్లు, గరీబ్ ఆహార యోజన రూ. 4.6 లక్షల కోట్లు మొత్తం కలిపినా 36,50,666 లక్షల కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు. కానీ మోడీ ప్రభుత్వం జిఎస్‌టి, సెస్‌ల పేరుతో రూ. 58 లక్షల కోట్లు ప్రజల నుండి వసూలు చేసింది. నికరంగా ప్రజల నుండి బిజెపి ప్రభుత్వం కొల్లగొట్టిన సొమ్ము 52 లక్షల కోట్ల రూపాయలు.

ప్రధాన మంత్రిగా అత్యున్నత హోదా లో ఉన్న వ్యక్తి మోడీ. ఆయన నోటి నుండి వెలువడే ప్రతిమాట విలువైనది. కానీ ప్రధాని మోడీ గత పదేళ్ళలో బహుశా ఆయన మాట్లాడినన్ని అబద్ధాలు మరొక దేశాధినేత ప్రపంచం మొత్తంలో మాట్లాడి ఉండరు. అది కూడా ఒక రికార్డు స్థాపించడం కాబోలు. లక్షలాది మంది గల బహిరంగ సభా వేదికల మీద నుండి ప్రసంగిస్తూ నిస్సంకోచంగా, ఎలాంటి తడబాటు లేకుండా ఆయన తేలికగా, అలఓకగా అబద్ధాలు చెప్పగలరు. టివి, ఇంటర్నెట్ ద్వారా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయన వీడియో ప్రసంగాలు ప్రసారం అవుతాయి. కొన్ని కోట్ల మంది ఆయన వీడియోలు చూస్తారన్న ధ్యాస అయనకు ఉండదా! రాజస్తాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగింస్తూ కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు అంటూ ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ దేశ ప్రధాని మాట్లాడం తగునా? మన ఎన్నికల నియమావళికి, మన రాజ్యాం గ లౌకిక భావాలకు విరుద్ధమైన మాటలు ఆయన మాట్లాడారు.

అన్ని రంగాలలో దేశ, విదేశీ సంస్థలు ఎప్పటికప్పుడు గణాంకాలు నమోదు చేస్తాయి. ప్రతి దానికి జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించిన గణాంక వివరాలు నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అబద్ధాల పునాదిగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు, మాటల నిజస్వభావాన్ని ప్రజలు తెలుసుకోలేరా? మనం మాట్లాడే ప్రతి మాటల్లో నిజాయితీని ఈ గణాంక వివరాలు పట్టిస్తాయి. తప్పులు మాట్లాడి బుకాయిస్తే ఈ ఆధునిక కాలంలో చెల్లుబాటు కావు.

 

డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News