నవ్వుతూ పరీక్ష హాల్లోకి వెళ్ళండి, నవ్వుతూ బయటికి రండి, వారియర్స్‌గా ఉండండి, వర్రీయర్స్‌గా మారకండి. ‘పరీక్షా పే చర్చ’లో ప్రధాని మోడీ అన్న మాటలో నిజంగా స్ఫూర్తిదాయకమైనవి. కానీ నిజంగానే ఇవాళ పరీక్ష హాల్లోకి వెళుతున్న విద్యార్థులు, పరీక్ష హాల్లో నుండి వెనుకకు తిరిగి వస్తున్న పిల్లల మొహాల్లో దేశప్రధానిగా ఆయన ఆశించినటువంటి సంకల్పం నెరవేరకపోవడానికి, మన విద్యా విధానాన్ని, పరీక్ష విధానాన్ని సమీక్షించడం, సంస్కరించలేకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నిరంతరం ఒత్తిడిలో మగ్గిపోతున్నారు. రాష్ట్రానికి కేంద్రానికి ఉమ్మడి జాబితాలో ఉండాల్సిన విద్యారంగం, తెలంగాణ దృష్టి సారించని కారణంగా కేంద్రం, రాష్ట్ర విధానాల మధ్య విద్యారంగం విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్యారంగం పట్ల సరైన దృష్టిని సారిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అది కొత్త సీసాలో పాత సారాన్ని నింపుతున్నట్టు అనిపిస్తున్నది. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వేలన్నీ మొన్నటికి మొన్న ‘ప్రథమ్’ సంస్థ విలువరించిన ఆన్వల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్, నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్ధ్యాలు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. వీటి గురించి చర్యలు తీసుకోవడం మాని, ఇప్పుడు పదో తరగతి పరీక్షల్లో నూటికి ‘నూరు శాతం’ ఫలితాలు రావాలని, అధికార యంత్రాంగం అంతా మార్నింగ్, ఈవెనింగ్ స్టడీ అవర్స్, స్లిప్ టెస్ట్‌లు, లక్ష్య, మోడల్ ప్రీఫైనల్స్ పేర నిరంతరం విద్యార్థుల్ని చదువు అంటే పరీక్షలు రాయడం గ్రేడ్లు తెచ్చుకోవడం. ‘అట్లా చదువలేని వాళ్లను, గ్రేడ్లు తెచ్చుకోని వాళ్లను.. ముందుకు పోకుండా నిరాకరించడమేనని ప్రొ. కృష్ణకుమార్ అన్నమాటలు నూటికి నూరు పాళ్ళు నిజం. అసలు పరీక్షలు జరపడానికి ఉన్న ఉత్సుకత విద్యా సంవత్సరాల పొడవునా బడుల్లో, తరగతి గదుల్లో విద్యార్థుల మెదళ్లలో పొడచూపుతున్న అనేక సమస్యల్ని పట్టించుకోకపోవడం ఇవాల్టి విద్యా రంగ దుస్థితిని తెలుపుతున్నది. అసమానతలు ఉన్న సమాజంలో పేద, ధనిక వ్యత్యాసాలు పెరిగిపోతున్న తరుణంలో డిఎస్ కొఠారి చెప్పిన కామన్ స్కూల్ విధానం అమలు కాకపోగా, ఆదాయ వనరులు ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, ఏ దిక్కు ముక్కు లేని సామాన్య ప్రజానీకపు బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలలు దిక్కయ్యాయి. ఐన్‌స్టీనే ఓ సందర్భంలో అన్నట్లు.. నీటిలో ఈదగలిగే చేపకు, భూమ్మీద నడిచే ఏనుగుకి, ఆకాశంలో ఎగిరే పక్షికి, తాబేలు కుందేలుకు ఒకే పోటీ పెట్టినట్లు.. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, రెసిడెన్షియల్, కార్పొరేట్ పాఠశాలల వేర్వేరు సామాజిక, ఆర్థిక అసమానతల మధ్య ఒకే ప్రశ్నా పత్రంతో పరీక్షలు నిర్వహించి, ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు అన్ని ర్యాంకులు మావే అని విద్యార్థుల మెదళ్లకు అంకెలేసి ఐఐటిలు, జెఇఇలు, సాఫ్ట్‌వేర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజినీర్లుగా కొందరిని తీర్చిదిద్ది, మెజారిటీ విద్యార్థుల భవిష్యత్‌ని అంధకారంలోకి నెడుతున్న విద్యా రంగాన్ని, పరీక్ష విధానాన్ని మార్చవలసి ఉన్నది. విద్య అంటే వివేకానందుడు అన్నట్లు విద్యార్థులలో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులను బయటకు తీయడం కదా! అందుకు అనుగుణంగా రవీంద్రుడు నడిపినట్టు ప్రకృతితో, ప్రకృతిలో విద్యను గడపడం, గాంధీ నై తాలింలో లాగా సామాజిక అవసరాలకు తగిన, నెహ్రూ కలగన్న సైంటిఫిక్ టెంపర్‌ని పెంపొందించే, కొఠారి కమిషన్ చెప్పిన కామన్ స్కూల్ విధానాన్ని కొనసాగించవలసి ఉన్నది. ఇవాళ విద్యారంగంలోని సంక్షోభాలను అర్థం చేసుకోలేనివాళ్లు, ప్రభుత్వ టీచర్లు ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ తమ పిల్లల్ని, తమ పాఠశాలలో చదివించడం లేదని విమర్శ వింటున్నాం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి నాయకులు, ఇతర అధికారుల పిల్లలు ఎవరూ కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో లేరనేది వాస్తవం. అందుకే ఎవరి పిల్లలకయినా సమాన, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించవలసి ఉన్నది. 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని నీరుగార్చేదిగా, రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని, ఒకే భాష ఒకే సంస్కృతి పేర కేంద్రం హిందీతో అనుసరించబోతున్న జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించవలసి ఉంది. ఆంగ్లం మీద మోజుతో గత ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ భాష పట్ల, సంస్కృతి భావా వేషాల పట్ల రాష్ట్ర ఆవిర్భావానికి విస్తృతంగా ప్రచారం చేసి, తెలంగాణ సంస్కృతిని, మాతృభాషను బొందపెట్టే పద్ధతిలో పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చడం వల్ల పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీషులో పాఠం, మరొకవైపు తెలుగులో పాఠాలు ముద్రించి, ఇటు తెలుగు చదువరాని, అటు ఇంగ్లీష్ మాట్లాడలేని తరాన్ని తయారు చేసింది. బలవంతంగా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులను ఆయా తరగతుల్లో ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టి, మన ఊరు మన బడి పేరిట మన విద్యా రంగాన్ని, విద్యార్థుల భవితవ్యాన్ని, ఆగమ్యగోచరంగా మార్చాం. ఇప్పుడు నూతన ప్రభుత్వాలు విద్యా రంగాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చి కోట్లాది మంది నిరుద్యోగులు అడుగుతున్న కనీస ఉపాధిని కల్పించలేని విద్యారంగ దుస్థితిని, స్థానిక అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్లుగా మార్చుకోవడం తక్షణ అవసరం. అందుకు అనుగుణంగా నూతన తెలంగాణ ప్రభుత్వం ఊరూరా బడి ఉండాలన్న నిర్ణయం అభినందించదగ్గ విషయమే. అందుకు భిన్నంగా కోట్లాది రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రూపొందించడం ఆహ్వానించదగ్గదే అయినా, వాటికి ముందున్న ఇరవై వేలకు పైగా బడులకు సున్నాలు, బ్లాక్ బోర్డుకు నల్లరంగు వేయకుండా, మంచి నీళ్ళు, మరుగుదొడ్లు లేని బడుల్ని బలి చేయకూడదు. పొద్దున్నే ప్రైవేటు బస్సుల్లో షూ, టై, బెల్టు ఇంగ్లీష్ మీడియం పేర తరలిపోతున్న బాలల్ని ఉన్న ఊర్లోనే చదువుకునేటట్లు పాఠశాల భౌగోళిక స్థితిగతుల్ని, కరికులాల్ని మార్చవలసి ఉంది. శారీరకంగా, మానసికంగా ఎదగటానికి ఆటలు, పాటలు, గ్రంథాలయాలు, సైన్సు లాంగ్వేజ్ లాబ్స్, కనీసం కంప్యూటర్ కీ బోర్డ్ ముట్టుకోలేని పిల్లలకు కంప్యూటర్ విద్యను, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యను, అంగన్వాడీలను బలోపేతం చేస్తూ, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితినుండి రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం.. విజ్ఞత కలిగిన పాలకులు, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, మేధావులు సమష్టిగా కృషి చేయవలసి వుంది. అందుకు ఎన్‌సిఇఆర్‌టిలను, డైట్‌లో, బి.ఎడ్ కళాశాలలో నిరంతరం శిక్షణలు, పరిశోధనలు కొనసాగించవలసి ఉన్నది. అందుకు పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు రావాలనే జిల్లా టార్గెట్‌లు, చూచిరాత పరీక్షలు మాని.. విద్యార్థులు, ప్రాజెక్టులు పుస్తక సమీక్షలు, ఫెయిర్ నోట్స్, ఫార్మేటివ్‌లు, ఆటలు, కళలు, శారీరక, మానసిక ఎదుగుదలలకు వేసే ఏ ప్లస్ గ్రేడ్లు కాకుండా విద్యార్థుల్లో స్వేచ్ఛగా, సమానంగా రేపటి సమాజాన్ని కుల, మత, వర్ణ, వర్గ, పేద, ధనిక తేడాల్లేని రవీంద్రుడు అన్నట్టు తలెత్తుకొని, తిరగగలిగే స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించడానికి బడుల్ని సిద్ధం చేయాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ, ప్రజాస్వామిక వైఖరుల్ని పెంపొందించాలి. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, అంబేద్కర్ తదితరుల స్ఫూర్తితో స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నీరుగారకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని, కొనసాగించాలి. అంబేద్కర్ ప్రజాస్వామ్య పాఠాన్ని కానీ, సెక్యులర్, సోషలిస్ట్ విలువలు, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పీరియాడిక్ టేబుల్‌ని తొలగించని చరిత్ర నుండి అభ్యున్నతి వైపు అడుగేసే తరాల్ని తయారు చేయడానికి విద్యారంగాన్ని, పరీక్ష విధానాన్ని మార్చవలసి ఉన్నది. కొఠారి కమిషన్ చెప్పినట్లు కేంద్రం 10 శాతం, రాష్ట్రాలు 30% విద్యా రంగానికి నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతానికి మించనీ నిధులతో కేవలం నియోజక వర్గానికో మెరుగైన పాఠశాలను నెలకొల్పి మిగిలిన పాఠశాలలను విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదు.