Monday, December 23, 2024

విప్లవ వీరుల త్యాగాలకు విలువ లేదా?

- Advertisement -
- Advertisement -

Are the sacrifices of revolutionary heroes worthless

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. దేశ స్వాతంత్రం కోసం అనేక మంది వివిధ రూపాల్లో పోరాడారు.1857లో తొలిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు దేశ వ్యాప్తంగా తిరుగుబాటు చేశారు. అంతకు ముందు కూడా ఒడిశా, తమిళనాడు తదితర ప్రాంతాల్లో కొందరు రాజులు బ్రిటిష్ వారిని ఎదిరించారు. కానీ కొంత మంది చరిత్ర కారులు 1857లో జరిగిన తిరుగుబాటుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేసిన తిరుగుబాటుగా అభిప్రాయపడ్డారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల పలు భారతీయ రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసే ప్రమాదం ఉందని గ్రహించిన ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. దీనినే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అని కూడా అంటారు. అయితే ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనలేదు.

‘ది గ్రాండ్ ఓల్ మాన్ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో వివరంగా తెలిపారు. బాల గంగాధర్ తిలక్, మోతిలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య వంటి ఆనాటి నాయకులు కొంత కాలం స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. 1915 తర్వాత దేశంలో గాంధీ శకం మొదలైంది. జలియన్ వాలబాగ్ ఉదంతం అనంతరం, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదలైన అతిపెద్ద ఉద్యమం ఇదే. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో గాంధీ ఈ ఉద్యమాన్ని ఆపివేశారు. అప్పుడే భగత్ సింగ్ వంటి ఆనాటి యువ కిశోరాలు దేశ స్వాతంత్రం కోసం విప్లవబాట పట్టారు.

దేశ వ్యాప్తంగా చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్, సుభాష్ చంద్రబోస్, ఉద్దాం సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు భారతీయుల హక్కులని కాలరాశారు. సహజ వనరులను దోచుకున్నారు. ఎటువంటి విచారణ లేకుండానే అనేక మందిని అరెస్ట్ చేశారు. అటువంటి పరిస్థితులలో సాయుధ పోరాటం ద్వారా దేశం కోసం పోరాడిన యోధులని స్మరించుకోవాల్సిన సమయమిది. వీరు చేసిన త్యాగాలను స్వాతంత్య్ర ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేనివారు తమ ఖాతాలో వేసుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ కూడా వీరి గొప్పతనాన్ని గుర్తించలేదు. అల్లూరి సీతారామరాజు చనిపోయిన తర్వాత వారి మాతృమూర్తి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆనాటి పాలకులు తిరస్కరించారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 లో చనిపోయారని చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగానే ఉంది. భగత్ సింగ్ వంటి గొప్ప వ్యక్తులని కూడ కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చరిత్ర పాఠాల్లో వీరు చేసిన ఉద్యమాలకు, త్యాగాలకు సరైన స్థానం లభించలేదు. ఈనాటి యువత ప్రస్తుత పాలకులనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయులు దేశంలో తరతరాలుగా హక్కులు కోల్పోయిన నిమ్నవర్గాల ప్రజల కోసం పోరాడితే, చంద్రశేఖర్ ఆజాద్ వంటి నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారు. సాయుధ పోరాటం అన్ని సందర్భాల్లో సరైన మార్గం కాకపోవచ్చు. కానీ బ్రిటిష్ వారు తమకున్న అని అస్త్రాలని ఉపయోగించి, భారతీయుల హక్కులని కాలరాస్తుంటే, విప్లవ మార్గం మాత్రమే సరైనదని నమ్మి ఆచరించిన నాటి విప్లవకారులని సముచిత రీతిలో గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

* యం. రాం ప్రదీప్- 9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News