మనతెలంగాణ/ హైదరాబాద్ : అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్ నెంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని, అవసరం లేని దగ్గర మాస్క్‌డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్, సిమ్.. ఇలా ప్రతిదానికి మనం ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు. దీనిపై ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్ పత్రమే ఈ మాస్క్‌డ్ ఆధార్. దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీనిని వినియోగించొచ్చు. ఆధార్ ఫోటోకాపీని ఏ సంస్థలతోనూ షేర్ చేయవద్దని కేంద్రం సూచించింది. మాస్క్‌డ్ ఆధార్ కోసం https://myaadhaar.uidai.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మార్గదర్శకాలను సవరించిన కేంద్రం…
ఆధార్ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్ కార్డు ఫొటోకాపీ (జిరాక్స్)ని మాత్రమే ఇవ్వాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలకు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవల కొందరు వ్యక్తులు ఆధార్ కార్డులకు ఫొటోషాప్‌లో మార్పులు చేసి దుర్వినియోగం చేశారని తెలిపింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులోని స్థానిక యూఐడీఏఐ కార్యాలయం సదరు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అలాంటి చర్యలను అరికట్టేందుకు కేంద్ర పత్రికా ప్రకటన జారీ చేసింది. మాస్క్‌డ్ కార్డును తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ఆధార్ వినియోగంలో పౌరులు పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఆధార్ లోని వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. అధీకృత వ్యక్తులు, సంస్థలు ఆధార్‌లో గోప్యంగా ఉండే వివరాలను పొందే అవకాశం లేదని తెలిపింది. యూఐడీఏఐ వ్యవస్థను అంత పటిష్టంగా రూపొందించామని పేర్కొంది.