Thursday, November 21, 2024

సంక్రాంతికి వెళ్తున్నారా… దొంగలు వస్తున్నారు జాగ్రత్తా

- Advertisement -
- Advertisement -

అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
కొత్తవారి కదలికలపై సమాచారం ఇవ్వాలి
కాలనీల్లో పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
సైబరాబాద్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వలెనే సంక్రాంతికి పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అంతరాష్ట్ర దొంగల ముఠాలు నగరానికి వచ్చి తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, బిహెచ్‌ఈఎల్ కాలనీల్లో అంతరాష్ట్ర దొంగల ముఠాలు చోరీలు చేస్తున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ఆంధ్రాకు చెందిన వారు వెళ్తారని దొంగలకు తెలుసు, దానిని ఆసరాగా చేసుకుని చోరీలు చేసేందుకు నగరానికి వస్తున్నారు. ఇది తెలిసి పోలీసులు ప్రతి ఏడాది అప్రమత్తం చేస్తున్నారు.

పండగకు వెళ్లే వారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. తాళం వేసి వెళ్లాలని, నాణ్యమైన తాళంను వేయాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పండగకు గ్రామాలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ దృష్టా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేశామని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పక్క ఇంటి వారికి కూడా సమాచారం ఇవ్వాలని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి సైబరాబాద్ పోలీసులు సంక్రాంతి సమయంలో చోరీల గురించి విస్కృతంగా ప్రచారం చేయడంతోపాటు, పెట్రోలింగ్‌ను ముమ్మరంగా చేయడంతో ఎలాంటి చోరీ కేసులు నమోదు కాలేదు. ఈ ఏడాది కూడా చోరీలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అనుమానస్పదంగా కన్పిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.

పోలీసుల సూచనలు…
విలువైన వస్తువులు స్కూటర్ డిక్కీల్లో, కార్లలో పెట్టరాదు.
ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
బీరువా తాళాలు ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.
గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి.
పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఇతరులకు చెప్పాకూడదు.
ఆరు బయట పెట్టే వాహనాలకు హ్యాండిల్ లాక్‌తోపాటు వీల్ లాక్ వేయాలి. వాచ్‌మెన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఎక్కువ రోజులు వెళ్తే తమతోపాటు తీసుకువెళ్లాలి.
టైమర్లతో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.
ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.
హోం సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్ లేదా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసి టివిలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటికి ధృడమైన, నాణ్యమైన తలుపులతోపాటు హై ఎండ్ గోద్రెజ్, హై సెక్యూరిటీ లాక్ సిస్టంను వాడడం మంచిది.
తాళం వేయడం కంటే గోద్రెజ్ డోర్ లాక్ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అనేది తెలియదు.
సొంత ఇల్లు వారు ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది.
ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సార్‌లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది.
తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీస్ స్టేషన్ నంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం సులభం.
అనుమానిత వ్యక్తుల కదలికలను పోలీసులకు చెప్పాలి.
ఊర్లకు వెళ్లే వారు చుట్టుపక్కల వారితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
నమ్మకమైన సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లను నియమించుకోవాలి.
కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని వాచ్‌మెన్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలని అపార్టుమెంట్ వాచ్‌మెన్లకు తెలపాలి.

స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి.
దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌లో తెలుపాలి. వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లకు వెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తారు.- కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం ఇవ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News