టి20లో అర్జెంటీనా విధ్వంసం
20 ఓవర్లలో 421 పరుగులు బాదిన మహిళా జట్టు
న్యూఢిల్లీ : మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా అర్జెంటీనా, చిలీ మహిళా జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. తొలుత బ్యాటింగ్ చసిన అర్జెంటీనా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 421 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 2022లో సౌదీ అరేబియాపై బెహ్రీన్ మహిళా జట్టు సాధించిన 381 పరుగుల ప్రపంచ రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది. ఓపెనర్లు లూసియా సియా అల్బెర్టీనా గలాన్ మొదటి వికెట్ కు 16.5 ఓవర్లలో 350 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. లూసియా 84 బంతుల్లో 27 ఫోర్లతో 169 పరుగులు సాధించి అవుట్ కాగా.. గలాన్ 84 బంతుల్లో 23 ఫోర్లతో 145 పరుగుల స్కోరు నమోదు చేసింది.
వన్ డౌన్ మారియో కాస్టినీరా 16 బంతుల్లో 40 పరుగుల అజేయ స్కోరుతో నిలిచింది. అంతేకాదు చిలీ బౌలర్లు 64 నోబాల్స్ వేయడంతో 73 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో సమర్పించుకోవాల్సి వచ్చింది. ఫ్లారెన్షియా మార్టినేజ్ ఒక్క ఓవర్లో 52 పరుగులు, కాన్ స్టాంజా ఒయార్సీ తన కోటా 4 ఓవర్లలో92 పరుగులు ఇవ్వటం కూడా చెత్త రికార్డులుగా నమోదయ్యాయి. ఎమీలియా టారో కేవలం 3 ఓవర్లలోనే 83 పరుగులు సమర్పించుకుంది. మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 422 పరుగులు చేయాల్సిన చిలీ 63 పరుగులకు కుప్పకూలింది. దీంతో అర్జెంటీనా 364 పరుగుల రికార్డు విజయం నమోదు చేయగలిగింది.