Wednesday, January 22, 2025

ప్రపంచకప్ ట్రోఫీతో అంబరాన్నంటిన సంబరాలు.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మెస్సి సేన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ట్రోఫీని సాధించడంతో దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా పులకించిపోయింది. అర్జెంటీనా చారిత్రక విజయం ఆ దేశ ప్రజలను ఆనందంలో ముంచెత్తింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జెంటీనా విజయంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. బాణాసంచా కారు హారన్‌లతో అర్జెంటీనాలోని అన్ని నగరాలు, పట్టణాలు హోరెత్తాయి. ప్రజలు డాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని చారిత్రక కట్టడం ఒబెలిస్క్ దగ్గరున్న రిపర్ ప్లేట్ ఒడ్డున లక్షలాది మంది అభిమానులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో దాదాపు 20 లక్షల మంది ప్రజలు పాలుపంచుకోవడం విశేషం. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి పాలుకావడంతో అర్జెంటీనాపై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే మెస్సి సేన మాత్రం తొలి మ్యాచ్ ఓటమి తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడలేదు. వరుస విజయాలతో ఏకంగా ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. కెప్టెన్ లియోనెల్ మెస్సి ఒంటిచేత్తో జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టాడు. సుదీర్ఘ కెరీర్‌లో అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటాడు. అర్జెంటీనా విజయంతో భారత్‌తో సహా పలు దేశాల్లో కూడా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దక్షిణ అమెరికాతో, ఆఫ్రికాతో పాటు ఆసియాలోని పలు దేశాల ప్రజల రోడ్లకు మీదకు వచ్చి వేడుకలు జరుపుకున్నారు.

ప్రశంసల వర్షం
విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య మెస్సి సేన ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై అభిమానులు, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు సయితం అర్జెంటీనా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన మెస్సి సేనను అభినందిస్తూ ట్వీట్‌లు చేశారు. విరాట్ కోహ్లి, రవిశాస్త్రి, వసీం జాఫర్, షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్, అశ్విన్, ఆకాశ్ చోప్రాలతో పాటు పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అక్తర్, వసీం అక్రం, బాబర్ ఆజమ్ తదితరులు అర్జెంటీనా జట్టును అభినందించారు. ఇదిలావుంటే అర్జెంటీనాఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యులు తిలకించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బిసిసిఐ అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News