మన తెలంగాణ/హైదరాబాద్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఆదేశాలను ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసు విచారణకు సంబంధించి సోమవారం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్జిటి ఆదేశాలకు విరుద్దంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటీషన్‌పై ఎన్జిటి చెన్నై బెంచ్ విచారణను ముగించింది. పనులు ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా చేపట్టిన కార్యకాలపాలపై తెలంగాణ ప్రభుత్వం పోటోలు సేకరించి అందచేసింది. దీనిపై కృష్ణా నది యాజమాన్య బోర్డు నేతృత్వంలో ఎన్జిటి బెంచ్ నియమించిన నిపుణుల కమిటి ఇటీవల ఎపిలోని కర్నూలు జిల్లాలో పర్యటించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతంలో పనులను తనిఖీ చేసింది. రెండు రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించిన అనంతరం నివేదిక అందచేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.