ముంబై: కస్టడీ నుంచి తనను విడుదల చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని గత నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో అరెస్టు అయిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ బుధవారం బాంబే హైకోర్టును అర్థించారు. తమకు నచ్చని వారిని తప్పుడు ఆరోపణలతో నేరంలో ఇరికించి అప్రతిష్ట పాల్జేయడం పోలీసులకు తగదని మాలిక్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోర్టులో వాదించారు. ఇడి ప్రస్తుతం ప్రశ్నిస్తున్న ఆస్తిని నవాబ్ మాలిక్ రెండు దశాబ్దాల క్రితం చట్టప్రకారం కొనుగోలు చేశారని ఆయన కోర్టుకు తెలియచేశారు. అయితే ఆ ఆస్తికి అసలు యజమాని మునీరా ప్లంబర్ ఇప్పుడు మాట మార్చిన కారణంగా మాలిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే 16 రోజులు జైలులో ఉన్న మాలిక్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించి విడుదల చేయాలని, ఈ వ్యవహారంపై తదుపరి పూర్తి స్థాయి విచారణకు తాము సిద్ధమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి.