అనర్హతపై హైకోర్టు స్టే ఇచ్చినా లోక్‌సభ సెక్రటేరియట్ అనుమతించడం లేదని లక్షద్వీప్ ఎంపి పిటిషన్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిలబడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ… కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో జైలు శిక్ష పడి అనర్హతకు గురైన లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని కోరగా, సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ఫైజల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనున్నది. ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11న కవరత్తి సెషన్స్ కోర్టు ఫైజల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
దీంతో అదే నెల 13 న ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఆయన తన జైలు శిక్షను కేరళ హైకోర్టులో సవాల్ చేయగా, ఆయనకు అక్కడ ఊరట లభించింది. దీంతో అనర్హత వేటుపై ఆయన ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా లోక్‌సభ సెక్రటేరియట్ తనపై అనర్హతను ఎత్తివేయలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిరోజూ పార్లమెంట్‌కు వచ్చినా, తనను భద్రతా సిబ్బంది సభ లోపలికి అనుమతించట్లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తనపై లోక్‌సభ సచివాలయం విధించిన అనర్హతను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. తన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాని ఫైజల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అభ్యర్థనను సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.