న్యూఢిల్లీ : 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6 న జరుగుతుంది. నామినేషన్లకు ఆఖరు తేదీ ఈనెల 19. అయితే ఇంతవరకు ఎన్‌డిఎ ప్రభుత్వం కానీ, విపక్షాలు కానీ అభ్యర్థిని పోటీకి ఎంపిక చేయలేదు. అయితే కొంతమంది అభ్యర్థులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎన్‌డిఎ అభ్యర్థిగా మొదటి స్థానంలో ఉన్నట్టు బిజెపి వర్గాల ద్వారా తెలిసిందని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును మరోసారి ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తే తన “మిషన్ సౌత్” లక్షానికి సహాయంగా ఉంటుందని బిజెపి అధిష్ఠానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్తర్ అబ్బాస్ నక్వీ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన బహుశా జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం కావచ్చు.
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పూర్వాపరాలు
కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 2019 సెప్టెంబర్ 6న నియామకమయ్యారు. విపిసింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర పౌర విమానయాన మంత్రిగా పనిచేశారు. విద్యార్థి నాయకునిగా 1972లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఖాన్ ఎఎంయు విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. 26 ఏళ్ల వయస్సు లోనే 1977 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి, 1980లోలోక్‌సభ ఎంపి అయ్యారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1989లో లోక్‌సభ ఎంపిగా ఎన్నిక కావడమే కాక, జనతాదళ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2004 లో బిజెపిలో చేరినప్పటికీ లోక్‌సభ సభ్యునిగా ఎన్ని క కాలేక పోయారు. 2019 సెప్టెంబర్ 1న కేరళ గవర్నర్‌గా నియామకమయ్యారు.