శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 45. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ‘45’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ “ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో అంశాలుంటాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో 45 మూవీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ “శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు.ఆయనకు ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. 45 మూవీని మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనంతో ఉండే చిత్రమిది”అని తెలిపారు. హీరో ఉపేంద్ర మాట్లాడుతూ “45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన వందకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్‌తో కలిసి ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఏంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి”అని తెలియజేశారు. హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ “దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది”అని పేర్కొన్నారు.