Tuesday, December 3, 2024

గ్రూప్-4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : జూలై 1న (శనివారం) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్షల నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన చర్యల గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్స్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో గ్రూప్-4 పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, ప్రపుల్ దేశాయ్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు, సౌకర్యాలు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పలు దఫాల్లో పరీక్షల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించడం జరుగుతుందని, పరిసర ప్రాంతాల్లో జీరాక్స్ సెంటర్లను మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 29 సెంటర్లు ఏర్పా టు చేసినట్లు పరీక్షల నిర్వహణ కోసం 29 మంది లైసెన్స్ ఆఫీసర్లు, 8 మంది రూట్ ఆఫీసర్లు, 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామని తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ఫ్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసి ఏదైనా సాంకేతిక సమస్యలు, సెంటర్ల వివరాలు, హాల్ టికెట్ల వివరాల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 630 39 28 718 నంబర్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా ఫోన్ కాల్ చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 10,654మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు, అందులో 29 మంది బ్లైండ్ అభ్యర్థులు 202 మంది దివ్యాంగ అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండవ పేపర్‌కు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బంది సైతం నిబంధనలు పాటించి విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సూరి, జిల్లా అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News