భారత దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, అభివృద్ధికర వర్గాలన్నీ కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న ఈ సమయంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) బిల్లు, 2023 ద్వారా దానిని బలోపేతం చేయాలని ఉద్దేశించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి), సాయుధ దళాల సిబ్బందికి మరిన్ని అధికారాలను ఇవ్వడం ద్వారా మరింత అభివృద్ధి నిరోధక శక్తిని ఈ చట్టాల ద్వారా సాయుధ దళాలకు అందించడం ద్వారా దానికి మరిన్ని ప్రజా వ్యతిరేక విషపు కోరలను జోడించాలని భావించడంగా వుంది. అందుకనుగుణంగా హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రచురించిన నివేదిక ప్రకారం విధుల్లో వున్నప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు సాయుధ దళాల సిబ్బందిపై కేసులు నమోదు చేయకుండా నిరోధించడానికి ఈ చట్టాల సంహిత మరిన్ని రక్షణలను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ చట్టం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) మొత్తం జమ్మూ కశ్మీర్,
ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. భారతీయ నాగరిక సురక్షిత సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) బిల్లుతో పాటు ఇతర రెండు క్రిమినల్ కోడ్‌లు (అంటే భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) బిల్లు, 2023, భారతీయ సాక్ష్య (బిఎస్) బిల్లు, 2023) ఆగస్టు 11, 2023న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. సాయుధ దళాలకు కొత్త అదనపు రక్షణ (వీటిలో ఆర్మీ, నేవీ, వైమానికదళం మొత్తం మూడు విభాగాలు వున్నాయి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) ఇప్పటికే వున్నది.బ్రిటిష్ వలసవాద- యుగం నిబంధనల కంటే ఎక్కువగా ఈ చట్టాలు వున్నాయి. క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్, ఇది మొదట 1898లో ప్రవేశపెట్టబడింది; తరువాత 1973లో సవరించబడింది. ప్రస్తుత చట్టంలో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు సంబంధించి నిర్దిష్ట షరతులు లేవు. అయితే కొత్తగా చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా సాయుధ దళాలపై ఎటువంటి కేసులు నమోదు చేయబడవు. ప్రాసిక్యూషన్, చట్టపరమైన కేసులు,
దావాల నుండి ఈ అదనపు రక్షణ సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టా (ఎఎఫ్‌ఎస్‌పిఎ)న్ని మరింత క్రూరంగా చేస్తుంది. ఎందుకంటే ఇది ఎవరినైనా అరెస్టు చేయడానికి లేదా చంపడానికి ‘కల్లోలిత లేదా అభ్యంతరకర, నిషేధిత కలిగించే ప్రాంతాల’ లో మోహరించిన సాయుధ దళాలకు ఇప్పటికే మంజూరుచేయబడిన అపరిమితమైన అధికారాలకు శక్తికి అదనంగా అధికారాలను ఇచ్చింది. ఉదా॥ డిసెంబర్ 2021లో నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో 30మంది ఆర్మీ సిబ్బంది 6 మంది అమాయక బొగ్గు గని కార్మికులను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. నాగాలాండ్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ వారిని ప్రాసిక్యూట్ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. అనేక సంవత్సరాలుగా సాయిధ దళాల ప్రత్యేక రక్షణ చట్టా (ఎఎఫ్‌ఎస్‌పిఎ) న్ని రద్దు చేయాలని పదేపదే ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామికవాదులు, మానవ హక్కుల సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇది భద్రతా దళాలకు ప్రాసిక్యూషన్ ప్రమాదం లేకుండా లేదా వారెంట్ అవసరం లేకుండా పనిచేయడానికి అనుమతిస్తుంది.
సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) లోని సెక్షన్ 4 సాయుధ బలగాలకు వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, కల్లోలిత, చెదిరిన ప్రాంతంలో శాంతి భద్రతలకు విరుద్ధంగా ప్రవర్తించే ఏ వ్యక్తికైనా మరణాన్ని కలిగించేంత వరకు బలప్రయోగం చేయడానికి ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది.ఇది అత్యంత కిరాతకమైనది, హేయమైనది. మానవ హక్కులకు పూర్తిగా వ్యతిరేకమైనది. ఈ విషయం లో సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం గురించి సంబంధిత వ్యక్తులు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ విషయం గురించి అనేక సంవత్సరాలుగా చెబుతున్నారు. ప్రజల ఒత్తిడి మేరకు మన్మోహన్ ప్రభుత్వం నవంబర్ 2004లో ఈశాన్య రాష్ట్రాల్లో చట్టంలోని నిబంధనలను సమీక్షించేందుకు జస్టిస్ బిపి జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇతర విషయాలతోపాటు ఇతర చట్టాలలో తగిన నిబంధనలను చేర్చడం ద్వారా సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టా (ఎఎఫ్‌ఎస్ పిఎ)న్ని రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సాయుధ బలగాలు, పారా మిలిటరీ బలగాల అధికారాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. అదే విధంగా సాయుధ బలగాలు మోహరించిన ప్రతి జిల్లాలో ఫిర్యాదుల సెల్లు (గ్రీవెన్స్‌సెల్) లను ఏర్పాటు చేయాలని తెలియజేసింది.
అదే పంథాలో 2005లో నియమించబడిన రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం (ఎఆర్‌సి) తన 5వ నివేదికలో కూడా సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ)రద్దుకు సిఫారసు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కొంచెం ఎక్కువ తక్కువగా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల రక్షణ చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) తో ముడిపడి వున్న మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలను దృష్టిలో వుంచుకుని ప్రకటనను కాలానుగుణంగా సమీక్షించి, మొత్తం రాష్ట్రాలకు, దేశానికి అమలు చేయడానికి బదులుగా పరిమిత జిల్లాలకు మాత్రమే దాని అమలును పరిమిత కాలంగా ఆరు నెలల లోపు వ్యవధిలో మాత్రమే ఉండాలని సూచించింది.అయితే ఈ సూచనలు లేదా సిఫార్సులు ఏవీ అమలు కాలేదు.2017లో అంతర్గత సాయుధ పోరాటాలలో మోహరించినప్పుడు జరిగిన దుర్వినియోగాల కోసం సైనికులను ప్రాసిక్యూషన్ నుండి సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) రక్షించదని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది.
నిజానికి సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) అనేది క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మొదటిసారిగా విధించబడిన బ్రిటిష్ కాలం నాటి చట్టానికి పునర్జన్మ ఇది. బ్రిటిష్ ప్రభువుల నుండి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ తర్వాత సాయుధ దళాల (అసోం, మణిపూర్) ప్రత్యేక అధికారాల చట్టం 1958లో స్వల్పకాలికంగా, తాత్కాలిక చర్యగా ప్రకటించబడింది. అయితే అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేయడానికి బదులుగా ఇతర రాష్ట్రాలకు కూడా పొడిగించారు. ఈ సందర్భంలో స్థూలంగా చూసినట్లయితే దేశంలోని విస్తృత ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుతో సహా వివిధ వర్గాల నుండి వస్తున్న తీవ్ర భయాందోళనలను పట్టించుకోకుండా సాయుధ దళాలకు ఇంకా పెద్ద ఎత్తున అధికారాలను ఇస్తూ సాయుధ దళాలను శక్తివంతం చేయడంగా మోడీ ప్రభుత్వం ప్రస్తుత చర్యను మనం చూడాలి. మిలిటరీ, పోలీసు, గూఢచార, దర్యాప్తు సంస్థలకు అపరిమిత,
అనియంత్రిత అధికారాలను కలిగి ఉండే విధంగా ఫాసిస్ట్ విధానాలతో లోతైన స్థితికి భారత దేశం వేగంగా పరివర్తన చెందుతున్న సందర్భమిది. ఈ హేయమైన ఫాసిస్టు చర్యను వ్యతిరేకిస్తూ అన్ని ఫాసిస్ట్ వ్యతిరేక, ప్రజాతంత్ర శక్తులు కృతనిశ్చయంతో ముందుకు రావాల్సిన సమ యం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.