సియుదాద్ విక్టోరియా(మెక్సికో): అమెరికామెక్సికో సరిహద్దు ప్రాంతాల్లో ఓ ముఠా జరిపిన సాయుధ దాడుల్లో కనీసం 15మంది చనిపోయారని మెక్సికో అధికారి ఒకరు తెలిపారు. నగరానికి తూర్పున ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం మెక్అలెన్ సరిహద్దులోని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఈ దాడులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. గల్ఫ్ కార్టెల్ అనే సాయుధ ముఠా ఈ దాడులకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ముఠా దాడుల్లో ఓ పోలీస్ కూడా మృతి చెందారు. ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఈ ముఠా పలు నేర చర్యలకు పాల్పడింది. ఇటీవల ఈ ముఠాలో చీలికలు వచ్చాయి. దాడులకు పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఓ వ్యక్తిని పట్టుకొని, మూడు వాహనాల్ని జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. కారు డిక్కీలో ఇద్దరు మహిళల్ని గుర్తించారు. వారిని ఆ వ్యక్తి కిడ్నాప్ చేసినట్టుగా భావిస్తున్నారు.