విద్వేషాలు ప్రబలకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి
శాంతిభద్రతలకు భంగం కలగొద్దు
మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై
కఠినంగా వ్యవహరించాలి
హైదరాబాద్‌లో నెలకొన్న
పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షలో
ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.. ప్రజల మధ్య మతవిద్వేషాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఎవరు యత్నించినా ఉపేక్షించవద్దన్నారు. తాను కూడా క్షణక్షణం పరిస్థితి ని ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఇం దులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సీపీలు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతబస్తీలో నెలకొన్న పరిణామాలపై సిఎం ఆరా తీశారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో శాంతి భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమగ్రంగా చ ర్చించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకూడదన్నారు. ప్ర శాంతంగా ఉన్న నగరంలో కొందరు దురుద్దేశపూర్వకంగానే ప్రజల మధ్య మత చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నారన్నారు. అలాంటి వారి మాటలను ప్రజలు విశ్వసించకుండా చూడాలన్నారు. అవసరమైతే సంబంధిత వర్గానికి చెందిన మతపెద్దలతో చర్చించాలని సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమైన నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా తగు ఓర్పు…నేర్పుతో వ్యవహరించాలన్నారు. పాతబస్తీలో అవసరమైతే మరింత గస్తీని పెంచేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని సిఎంకు అధికారులు వివరించారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తును మరింతగా పెంచామన్నారు. యాక్షన్ ఫోర్స్ బలగాలను మీర్‌చౌక్, గోషామహల్, చార్మినార్ జోన్ల పరిధిలో పహారా ఏర్పాటు చేశామన్నారు.
మూడు ఎసిపి జోన్ల పరిధిలో 360 మంది ఆర్‌ఎఎఫ్ జవాన్లతో పహారా కాస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పాతబస్తీలో పలు ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి పలుచోట్ల ట్రాఫిక్ మళ్లించనున్నామన్నారు. కాగా సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలన్నింటిని బంద్ చేయిస్తున్నామన్నారు. ఈ మేరకు ముందుగానే పోలీసు వాహనాల నుంచి మైకుల ద్వారా ప్రకటనలు (అనౌన్స్‌మెంట్) జారీ చేశామని తెలిపారు. మరోవైపు వినాయక చవితి ఉత్సవాలు కూడా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసు శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ సూచించారు. ఈ విషయంలో చిన్న పొరపాటుకు కూడా తావివ్వదన్నారు.