Friday, December 20, 2024

సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే

- Advertisement -
- Advertisement -

సాయుధ పోరాటంలో గానీ, స్వాతంత్య్ర పోరాటంలో గానీ అసలు ఏ ఉద్యమంలోనూ బిజెపి పాత్ర లేదు. అసలు సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బిజెపికి లేదు.దేశంలో లౌకిక వ్యవస్థను నాశనం చేసేందుకు, రాజకీయ లబ్ధి కోసం పోరాటాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 చరిత్ర గురించి ఆయా పార్టీల నేతలు వారి సొంతం అన్నట్లుగా మాట్లాడుతున్నాయి. తెలంగాణ విమోచన దినం అంటూ ఎప్పుడు లేనిది బిజెపి గతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టి తెలంగాణ అమరవీరులను ఆకాశానికి ఎత్తేసింది. పోరాట యోధులం టూ తెలంగాణ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తేశారు అమిత్ షా. మరోపక్క బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా కెసిఆర్ బిజెపిపై మండిపడుతూ జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను వక్రీకరిస్తున్నారని, చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని అప్రమత్తంగా లేకపోతే సమాజాన్ని అల్లకల్లోలం చేసేస్తారు అంటూ విరుచుకుపడ్డారు.

ఇంకో పక్క కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అటు బిజెపిపైనా ఇటు బిఆర్‌ఎస్ పైనా విమర్శలు సంధించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెసేనని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బిజెపి పాత్ర అసలు ఉందా? స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ పోరాడిందని అప్పుడు బిజెపి పుట్టనేలేదన్నారు. అలాగే పనిలో పనిగా కెసిఆర్‌పై కూడా విమర్శలు సంధించారు. తెలంగాణ ఏర్పడి ఇన్నాళ్లకు కెసిఆర్‌కు జాతీయ సమైక్యత దినం గుర్తుకొచ్చిందా? ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదు? అంటూ ప్రశ్నించారు. ఇలా సెప్టెంబర్ 17 చరిత్ర గురించి ఎవరికి వారే తమ ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో మమేకం అయినట్లే వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకున్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణలో ఆంధ్ర మహా సభ ఉద్యమం భూస్వామ్య దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగింది. ఆ పోరాటంలో లక్షలాది మంది ప్రజలు చిత్రహింసలకు గురయ్యారు.

రజాకార్లు, దొరల గూండాలు, నిజాం పోలీసుల చేతిలో 1500 మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమైన దశలో అంటే 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించి కమ్యూనిస్టులపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 2500 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సాధారణ ప్రజలు చనిపోయారు. అజ్ఞాతంలో ఉన్న కమ్యూనిస్టు పోరాట యోధుల ఆచూకీ చెప్పాలని లక్షలాది మంది తెలంగాణ ప్రజలను భారత సైన్యం తీవ్ర చిత్ర హింసలకు గురి చేసింది. ఇలాంటి పోరాట పరిస్థితులలో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ విధిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరడం సాధ్యమైందని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చౌకబారు సూత్రీకరణకు పాల్పడుతున్నాయి. మత రాజకీయాల పేరుతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని చరిత్రను వక్రీకరిస్తూ, తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత కోణంలో చిత్రిస్తున్నారు.

ఇలా చరిత్రను వక్రీకరిస్తూ తమ రాజకీయ భావజాలంతో సంబంధం లేని వ్యక్తుల చిత్ర పటాలకు దండలు వేస్తూ దేశంలోని వివిధ ప్రజా పోరాటాలను తమ ఖాతాలో వేసుకునేందుకు బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుటిల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. భిన్న మతాలు, తెగల సంప్రదాయాలకు నిలయమైన భారత దేశంలో ప్రతి అంశాన్ని మతం చిచ్చులోకి లాగడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి పాలకులు దేశంలో అలజడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏ ఉద్యమాల్లోనూ వారి భాగస్వామ్యం లేకపోయినా చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలిసి 77 ఏండ్లు అవుతున్నా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు అవుతున్నా ప్రజల జీవన ప్రమాణాల్లో గొప్ప మార్పేమీ లేదు. ఈ నేపథ్యంలో కుల, మత విద్వేష కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మెరుగైన జీవనం కోసం, ఆర్థిక అసమానతలు అంతం చేయడానికి ఇపుడు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉంది.

అందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధం కావాలి. సంఘ్ పరివార్ ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను దేవదేవుడిగా చిత్రిస్తుంది. కానీ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను సర్దార్ పటేలే 1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా కొనసాగించారు. పైగా ఆయనకు నష్ట పరిహారాలు, రాజాభరణాలు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్ ప్రముఖ్ పదవిలో ఉన్నందుకు, ఆ రోజుల్లోనే సంవత్సరానికి రూ. 50 లక్షలు చెల్లించారు. గాంధీని హత్య చేసిన గాడ్సేని సంఘ్ పరివార్ శ్రేణులు పూజిస్తాయి. మరోవైపు బిజెపి నాయకులు గాంధీ చిత్రపటానికి వంగివంగి దండాలు పెడతారు. బిజెపి ఆధ్వర్యంలో గాంధీ మేళాలు నిర్వహించడం, కొమరం భీవ్‌ు, అల్లూరి సీతారామరాజు జయంతులు నిర్వహించడం ద్వారా వాళ్ల పోరాటాలకు తమ పార్టీ ముద్ర వేసుకోవాలని ఆరాటపడుతున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఇప్పుడు భిన్నవాదనలు తెరపైకి వస్తున్నాయి.

విలీనం అని ఓ వైపు, విమోచనం అని మరోవైపు తమ వాదనలు వినిపిస్తున్నారు రాజకీయ నేతలు. అయితే వారి ప్రయోజనాల కోసమే సాయుధ పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది కమ్యూనిస్టులు, రజాకార్లతో పోరాడింది కమ్యూనిస్టులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసత్వం కమ్యూనిస్టులదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News