Sunday, December 22, 2024

ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీని భారత్‌కు రప్పించనున్నారు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, లంచంకు సంబంధించిన కేసుల్లో భారత్‌కు కావలసిన ఆయుధాల డీలర్ సంజయ్ భండారీని యూకె నుంచి భారత్‌కు అప్పగించనున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆజ్ఞాపించింది. 2015 జూలై 1 నుంచి 2017 ఫిబ్రవరి 7 మధ్యకాలంలో సంజయ్ భండారీ తన విదేశీ సంపదను ఆదాయపు పన్ను అధికారులకు తెలుపకుండా మోసగించాడని ఆరోపణ. అతడు ప్రపంచ వ్యాప్తంగా తనకున్న సంపదపై ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంది. అన్‌డిస్‌క్లోజ్డ్ అసెట్స్ కింద అతడు మినహాయింపు పొందడానికి కూడా అవకాశంలేదు. అతడు తన విదేశీ సంపద, ఆదాయాన్ని తెలుపకుండా దాచాడు. అతడు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణ.

2009లో స్విస్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు నుంచి 75 బేసిక్ ట్రయినర్ విమానాలు కొనే విషయంలో అతడు భారత వైమానిక దళ అధికారులకు లంచం ఇచ్చాడని, పిలేటస్ డీల్‌లో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణ. దుబాయ్‌లోని అతడి బ్యాంకు ఖాతాకు రూ. 2895 కోట్లు స్విస్ విమాన తయారీ సంస్థ చెల్లించిందని తెలుస్తోంది. సిబిఐ, ఈడి రెండూ అతడిపై భారత్‌లో కేసులు పెట్టాయి. భండారీ 2016లో దేశం నుంచి పరారి అయ్యాడు. అతడిపై లుకౌట్ నోటీసు కూడా జారీ అయింది. అతడిని అప్పగింత వారంట్‌పై 2020 జూలై 15న లండన్‌లో అరెస్టు చేశారు. భండారీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రాతో వ్యాపార సంబంధాలున్నట్లు సమాచారం. అయితే భండారీతో తనకెలాంటి సంబంధాలు లేవని రాబర్ట్ వాద్రా ఖండిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News