Monday, January 20, 2025

నైగర్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశాధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

నియామి : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్టు సైన్యం ప్రకటించింది. దేశంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణించడంతోపాటు ఆర్థికంగా, సామాజికంగా పేలవమైన పాలన కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కర్నల్ మేజర్ అమదౌ బద్రామనె ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్‌లో ప్రకటించారు. ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశ వ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని , దేశ సరిహద్దులను కూడా తాము మూసివేసినట్టు సైన్యం ప్రకటించింది.

ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించింది.బజౌమ్ మద్దతుదారులు అధ్యక్ష భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు వారిని అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. నైగర్‌లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య , ఫ్రాన్స్, అమెరికా, ఆఫ్రికా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్రంగా స్పందించి అధ్యక్షుడు బజౌమ్‌ను తక్షణం విడుదల చేయాలన్నారు. 1960లో ఫ్రాన్స్ నుంచి నైగర్ స్వాతంత్య్రం పొందింది. ఆ తరువాత నుంచి నైగర్‌లో అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో బజౌమ్ విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఫ్రాన్స్, పశ్చిమ దేశాలకు సన్నిహితుడైన బజౌమ్‌ను పదవి నుంచి వైదొలగించడానికి ఇప్పటివరకు నాలుగుసార్లు కుట్రలు జరిగాయి. మరోవైపు ఇస్లామిక్ చొరబాటుదారులతో నైగర్ సతమతమవుతోంది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో పశ్చిమదేశాలకు బజౌమ్ సహకారం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News