జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలోగల రంజిత్ సాగర్ ద్యామ్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్‌కు చెందిన పైలట్ల ఆచూకీ కోసం బుధవారం గాలింపు చర్యలు మళ్లీ మొదలైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరుగగా మంగళవారం రాత్రి గాలింపు చర్యలను నిలిపివేశారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ద్యామ్ ఉంది. కాగా..హెలికాప్టర్ కూలిపోయిన సరస్సు పంజాబ్, జమ్మూ కశ్మీరు ప్రభుత్వాల అధీనంలో ఉంది. నౌకాదళానికి చెందిన సముద్రపు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం కూలిపోయిన ప్రదేశంలో నీటి లోతు 200 అడుగుల మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం పడవల ద్వారా సరస్సులో గాలింపు చర్యలు చేపట్టగా హెలికాప్టర్‌కు చెందిన కొన్ని శకలాలు లభించినట్లు కతువా ఎస్‌ఎస్‌పి ఆర్‌సి కొత్వాల్ తెలిపారు. సరస్సుపైన ఎగురుతుండగా హఠాత్తుగా హెలికాప్టర్ సరస్సులో కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాటి గాలింపులో ఒక హెల్మెట్, రెండు పెద్ద సైజు బ్యాగులు, ఒక షూ, ఐడి కార్డులు, కొన్ని హెలికాప్టర్ శకలాలు లభించినట్లు వారు చెప్పారు.