సిబ్బంది క్షేమం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్17 హెలికాప్టర్ గురువారం తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. కాగా ఈ సంఘటనలో హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలెట్లు, ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఒక ఇంజనీర్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ హెలికాప్టర్ మెయింటెనెన్స్ పరీక్షలో భాగంగా హాయులియాంగ్‌నుంచి రోచమ్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి శాఖాపరమైన దర్యాప్తుకుఆదేశించారు. కాగా ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు( ఐటిబిపి)కి చెందిన జవాన్లు సహాయక చర్యలు చేపట్టారు.గత పెప్టెంబర్‌లో జమ్మూ, కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా పట్నిటాప్ టూరిస్టు రిసార్ట్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ఒకటి కొండపై కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. అలాగే ఆగస్టు 3న మరో ఆర్మీ హెలికాప్టర్ పఠాన్ కోట్ సమీపంలో రంజిత్ సాగర్ డామ్ జలాశయంలో కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.