Monday, December 23, 2024

8నుంచి ‘ఆరోగ్య మహిళ’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర కు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే అరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల సమగ్ర అరో గ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ప్రధానంగా ఎ దుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుం చనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మం త్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం బిఆర్‌కె భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సిఎస్ శాంతి కుమారి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, డైరెక్టర్ పిఆర్ హన్మంత రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిపిఆర్, కంటి వెలుగు, కాంప్రహెన్సివ్ విమెన్ హెల్త్ ప్రోగ్రాంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్‌ఒలు, ఎస్‌పిలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీనిని అందిసున్నదని అన్నారు.

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారని, రెఫరల్ సెంటర్లుగా ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉంటాయని వివరించారు. ఇది సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమని పేర్కొన్నారు. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయని అన్నారు.

మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 1,200 పిహెచ్‌సి, యూపిహెచ్సి, బస్తీ దవాఖానల్లో విస్తరించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో విజవంతంగా నిర్వహించాలని, ఈ ప్రత్యేక సేవల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు చెప్పుకోలేక ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పాలని, ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరీక్షలు, చికిత్స పొందాలని అందరికీ తెలియచేయాలని వివరించారు. మార్చి 8న రోజున ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు,ఎంఎల్‌ఎలు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొనాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్‌వోలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాల్లో ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామనే వివరాలు ముందుగా ప్రజా ప్రతినిదులు, ప్రజలకు తెలియచేయాలని చెప్పారు.

సిపిఆర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి

కార్డియో పల్మనరీ రిససిటేషన్(సిపిఆర్)పై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి తెలిపారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే వారికి సిపిఅర్ చేస్తే కనీసం 5 గురిని బతికించవచ్చని అన్నారు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందని, అయితే సకాలంలో సిపిఆర్ చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. సిపిఆర్‌పై శిక్షణ ఇచ్చి, జిల్లాకు 5 మాస్టర్ ట్రైనింగ్ చేసి పంపించామని, వారితో వైద్య, పోలీసు, మున్సిపల్ , ఇతర విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్‌ఒలు కృషి చేయాలని కోరారు.ఇందుకోసం ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. సిపిఆర్ చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదని, ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డెఫిబ్రిలేటర్స్(ఎఇడి) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందని వివరించారు. మొదటి దశలో 18 కోట్లతో 1200 ఎఇడి మిషన్లు కొనుగొలు చేస్తున్నామని, అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.

కంటి వెలుగు అందరికీ చేరాలి

రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక్కో క్యాంపులో రోజుకు 100 నుండి 120 మందికి పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1420 వార్డులు అంటే 42 శాతం పూర్తయిందని, సగటున 14 శాతం మందికి అద్దాలు అవసరం పడుతున్నదని చెప్పారు. అయితే కొన్ని జిల్లాలో కంటి పరీక్షలు రాష్ట్ర సగటు కంటే తక్కువ జరుగుతున్నాయని, ఆయా జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్‌ఒలు, డిప్యూటీ డిఎంహెచ్‌లు దృష్టి సారించాని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సమీక్షలు చేయాలని, తప్పకుండా క్యాంపులు సందర్శించాలని చెప్పారు.

‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంలో నిర్వహించే 8 రకాల ఆరోగ్య పరీక్షలు

1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News