మన తెలంగాణ /హైదరాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం పరిశుభ్రత కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. నగరాల్లో బలి జంతువుల వ్యర్ధాలు, బలి స్థలాలు, చర్మాలను వెంటనే శుభ్రం చేయడానికి తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఈద్ ఉల్ అజా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఈదుల్ ఉల్ అదా శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో మన జీవితంలో మరో ఈద్ ఉల్ అదా భాగ్యం కలిగిందన్నారు. బక్రీద్ త్యాగం సందర్భంగా స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇళ్లతో పాటు, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రత్యేకించి, అందరితో ప్రేమ ఆప్యాయతలతో వ్యవహరించాలని. బలి అనంతరం జంతువుల వ్యర్థాలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన స్థలంలో వేయాలని హోం మంత్రి కోరారు. సర్వశక్తిమంతుడైన అల్లా మన ప్రార్థనలు, పారాయణాలు మరియు త్యాగాలను స్వీకరిస్తాడని తెలిపాడు. ఈదుల్ అదా సందర్భంగా ప్రార్థనలు నిర్వహించడం ద్వారా దేశంలో పరిస్థితులు మెరుగుపడాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించాలని కోరారు.