Sunday, December 22, 2024

నాగోబా జాతరకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఇంద్రవెల్లి : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ దర్బార్ హాల్‌లో నాగోబా జాతర ఏర్పాట్లపై ఐటిడిఎ పివో కె. వరుణ్ రెడ్డితో కలిసి ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపురాల నిర్మాణం పనులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లను కలెక్టర్, పివో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. నూతన నాగోబా దేవాలయాల నిర్మాణం, కోవిడ్ వలన రెండు సంవత్సరాల అనంతరం దర్బార్‌కు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ నెల 21 న రాత్రి మహా పూజ కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ప్రారంభమై 24న దర్బారు, 28 వరకు జాతర కొనసాగుతుందని తెలిపారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర చత్తీష్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలు ధాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ముత్నూర్ నుండి కెస్లాపూర్ వరకు, మెండపల్లి హర్కాపూర్ రోడ్డు పనులు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు సూచించారు. శానిటేషన్, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయడం నిరంతరం జరిగేలా సిబ్బందిని నియమించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు హైమస్ లైట్‌లను ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్కు, భౌతిక దూరం పాటించే విధంగా భక్తులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరంతో పాటు 104, 108 అంబులెన్స్‌లను 24 గంటలు అందుబాటులో ఉంచి నంతరం వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్‌ఎడబ్లూఎస్ అధికారులను ఆదేశించారు. దర్బార్కు రాష్ట్ర దేవాదాయ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు రానున్న దృష్టా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. వీఐపీలు,మహిళలు పరుషులు ప్రత్యేక క్యూలైన్లలో నాగదేవతను దర్శించుకునే విధంగా పోలీసుల సహకారంతో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులను జాతరలో నిరంతరం నడపాలని ఆర్టీసీ అధికారులను సూచించారు.

ఐటిడిఎ పివో కె వరుణ్ రెడ్డి మాట్లాడుతూ నాగోబా జాతర విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇది వరకే శాఖల వారిగా సూచించిన పననులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.మర్రి చెట్టుప్రాంతం, గోవాడ, దేవాలయ ప్రాంగణ సమపంలోని మట్టిని చదును చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని, విద్యుత్ శాఖ అధికారులకు పివో ఆదేశించారు. గిరిజన సాంప్రదాయ పూజ కార్యక్రమాలకు అవసరమైన పూజా సామాగ్రి విద్యుద్దీకరణ పూలమాల అలంకరణకు తదితర సామాగ్రి సమకూర్చాలని దేవాదాయ శాఖ ఈవోను ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఉట్నూర్ ఏఎస్పి హర్షవర్ధన్ అన్నారు.

అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల పురుగతిపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డివో కె. సురేష్, డిడి దిలిప్ కుమార్, ఆలయ ఈవో ఎం. రాజమౌళి, సర్పంచ్ రేణుక, ఆలయ పీఠాధిపతి వెంకట్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఓఎసిడి కృష్ణయ్య, అదనపు వైద్యాధికారి కొమురం బాలు, ఏవో రాంబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News