66.61లక్షల అన్నదాతలకు లబ్ధి ఈ సీజన్ రైతుబంధుకు
రూ.7645.65 కోట్లు సిద్ధం ఎకరానికి రూ.5వేల చొప్పున
152.91లక్షల ఎకరాలకు నిధులు ఈ నెల 10వరకు ధరణి పోర్టల్‌లో
నమోదు చేసుకున్న భూములకు వర్తింపు : మంత్రి నిరంజన్ రెడ్డి
ఎనిమిది విడతలు రూ.50వేల కోట్లు
మనతెలగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు నిధుల విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నుంచి రైతుబంధు పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. తొలుత ఎకరం లోపు రైతుల ఖాతాలకు నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత రోజుకు ఎకం చొప్పున రెండు ఎకరాలకు , మూడు ఎకరాలకు పెంచుకూంటూ పోతూ జనవరి 10వతేది నాటికి రైతులందరికి నిధులు అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. సోమవారం నాడు మంత్రి రైతుబంధు నిధుల పంపిణీ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి ఖర్చుల కింద రైతుబంధు పథకం ద్వారా రూ.7645.66కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కొ ఎకరానికి రూ.5000 చొప్పున మొత్తం 152.91లక్షల ఎకరాలకు నిధులు సమకూరుస్తున్నామన్నారు.
ఈ సీజన్‌లో రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో 66.61లక్షల మంది రైతులకు లబ్ది కలుగనున్నట్టు తెలిపారు. ఇందులో 3.05లక్షల ఎకరాలకుగాను 94వేల మంది రైతులు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాదారులుగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 10వతేది నాటికి ధరణి పోర్టల్‌నందు పట్టాదారులుగా ,ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు కూడా రైతుబంధు పథకం కింద అర్హులే అని వెల్లడించారు. ఈ పథకం ద్వారా మంగళవారం నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆరోహణ క్రమంలో తొలిరోజు ఎకరంలోపు రైతులతో నిధుల జమను ప్రారంభించి ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఎకరం చొప్పున నిధుల జమను పెంచుకుంటూ వెళ్లనున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.టిఆర్‌ఎస్ సర్కారు గత వర్షాకాల సీజనల్‌లో రూ.7508.78కోట్ల రూపాయలు రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందజేసింది. 150.18లక్షల ఎకరాలకు సంబంధించిన 63,25,695మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఈ మేరకు నగదు జమ చేసింది.
ఈ పథకం కింద పంటల సాగుకు పెట్టుబడి సాయం అందుకున్న రైతులు ఎంతో ఉత్సాహంగా పంటలు సాగు చేసి గణనీయమైన దిగుబడులు సాధించగలిగారు.అత్యధికంగా 61లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి తద్వారా రికార్డు స్థాయిలో కోటి38 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాం పండించగలిగారు. అంతే కాకుండా వాణిజ్య పంటల్లో ప్రధానంగా 50.94లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేసి 69.46లక్షల బేళ్ల పత్తి దిగుబడులను సాధించగలిగారు. కంది.పెసర, మినుము, వేరుశనగ , సోయా , పసుపు, మిరప తదితర రకాల పంటల దిగుబడిని కూడా గణనీయంగా పెంచి ఆర్ధికంగా ఆదాయాన్ని సమకూర్చుకోవటంతోపాటు కరోనా కష్టకాలంలో రాష్ట్ర జిడిపి వృద్ధికి వ్యవసాయరంగం ద్వారా రైతులు పెద్ద ఎత్తున చేయూత నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పథకం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఏడు విడతలలో రూ.43,036.63కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని , మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌తో కలుపుకొని మొత్తం రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందజేసినట్టు అవుతుందన్నారు.ఈ పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తుమ 20పథకాలలో ఒకటిగా రోమ్‌లో 2018నవంబర్‌లో జరిగిన అంతర్జాతీ సదస్సులో ఎఫ్‌ఎఒ ప్రశంసించిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.