మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో మే 6 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియెట పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి, వైద్య, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 234 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు లక్ష 53వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతుండగా, ఇంటర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిపరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్‌లతో పాటు ఎఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీటి సరఫరాతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే రూట్లల్లో బస్సులను అదనంగా, పరీక్షల సమాయానికి అనుగుణంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
రూట్‌బస్ పాస్ ఉన్న విద్యార్థులు ఆరూట్‌లోనే కాకుండా హాల్ టికెట్ ,బస్‌పాస్ కలిపి చూపించి వేరే రూట్లలో కూడా ప్రయాణించవచ్చని తెలిపారు. చీప్ సూపరింటెండెంట్స్, ఎగ్జామినేషన్ సెంటర్ల డిపార్ట్‌మెంటల్ ఆపీసర్ల నుంచి జవాబు పత్రాల బండ్లను సరిచూసుకుని తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగాఉండాలని పోస్టల్ శాఖాధికారులను అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్ష సమయంలో ట్రాపిక్ ఇబ్బ ందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ షాపులు తెరచి ఉంచినచో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈసమావేశంలో డిఆర్‌ఓ సూర్యలత, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వడ్డెన్న, ఇతర శాఖల అధికారుల పాల్గొన్నారు.