మన తెలంగాణ /గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అండం మాధవరెడ్డి పలువురు బాలికల పట్ల లైంగిక వేధింపులు పాల్పడినందుకు బాధిత తల్లిదండ్రుల ఫి ర్యాదు మేరకు కేసు నమోద చేసినట్టు ఎస్‌ఐ యాకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అండం మాధవరెడ్డి గత కొంతకాలంగా విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటున్నట్టు నటిస్తూ పలువురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఒంటి పూట బడి నడుస్తుండగా సోమవారం ఉదయం పాఠశాల నుండి బాలికలు ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు లేట్ అయిందని ఆరా తీశారు. దీంతో పాఠశాలలో జరిగిన విషయాలను వారు తల్లిదండ్రులకు తెలిపారు. అడపాదడపా తమకు డబ్బులు ఇస్తూ రకరకాలుగా శరీర భాగాలను తాకేవాడని వారు తమ తల్లిదండ్రులకు ఏకరువు పెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.