Wednesday, January 22, 2025

750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బ్లాక్‌మెయిలింగ్ చేసిన కేసు

ముంబై : మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను డబ్బుకోసం బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీను పోలీసులు అరెస్టు చేశారు. సినీఫక్కీలో జైసింఘానీ ఫోన్లను మార్చేస్తూ రెండుసార్లు పోలీస్‌ల కళ్లు గప్పి తప్పించుకొన్నాడు. చివరికి అతడిని వడోదర సమీపం లోని కోలాల్ వద్ద ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇందుకోసం పోలీసులు 72 గంటల పాటు ఆపరేషన్ ఏజే పేరిట గాలింపు చేపట్టారు. దాదాపు 750 కిమీ అతడిని వెంటాడారు. జైసింఘానీను మలబార్‌హిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడు రెండుసార్లు పోలీస్‌లకు మస్కా కొట్టి తప్పించుకొన్నాడు.

అతడు చాలా ఎలక్ట్రానిక్ పరికరాలను మార్చాడు’అని సైబర్ పోలీస్ డీసీపీ బాలాసింగ్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర లోనే అతిపెద్ద క్రికెట్ బుకీల్లో ఒకడైన జైసింఘానీపై దాదాపు 15 కేసులు ఉన్నాయి. అనిల్ మొబైల్ లొకేషన్‌ను తొలిసారి గుజరాత్‌లో శుక్రవారం గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది సూరత్‌కు మారిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అనిల్ ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లిపోయాడు. చివరికి కొలాల్ సమీపంలో అదుపు లోకి తీసుకున్నారు. అనిల్ సిమ్ కార్డుల నుంచి ఫోన్లు అసలు చేయడని, ఇంటర్నెట్ ఆధారిత వీవోఐపీ కాల్స్ మాత్రమే చేస్తాడన్నారు. అతడు వేర్వేరు పేర్లతో డాంగిల్స్‌ను కొనుగోలు చేసేవాడు. వాటిని ప్రతి ఐదారు రోజులకు మార్చేసేవాడని పోలీసులు వెల్లడించారు.

అతడి నుంచి రెండు డాంగిల్స్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌జైసింఘానీ కుమార్తె అనిక్ష ఏకంగా మాజీ సిఎం ఫడ్నవీస్ భార్య అమృతాను బెదిరించింది. తొలుత రూ. కోటి ఇస్తానని, తన తండ్రి అనిల్‌ను కేసుల నుంచి బయటపడేయాలని కోరింది. దానికి అమృత నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి వాటిని లీక్ చేస్తానని బెదిరించింది. తనకు రూ. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనిపై అమృతాఫడ్నవీస్ కేసు పెట్టింది.

అనిక్షను గురువారమే పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ అంతర్జాతీయ క్రికెట్ బుకీ. ఐపీఎల్ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ నిర్వహించేవాడు. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండడానికి పోలీసులకు భారీగా లంచాలు ఇచ్చేవాడు. ఆ తర్వాత వాటిని వీడియోలు తీసి పోలీసులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు.నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశాడు. కేసు విచారణకు అతని ఇంటికి పోలీసులు వెళ్తే వారిపైకి పెంపుడు శునకాలను ఉసికొలిపి భయపెట్టేవాడని వీడియో కథనాలు పేర్కొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News